బాలయ్య ఫెవరెట్ కి కోపం వచ్చిందే

0గౌతమిపుత్ర శాతకర్ణితో సంగీత దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చిరంతన్ భట్ హర్ట్ అయ్యారు. అవును మరి. టిపికల్ సబ్జెక్ట్ కు కష్టపడి సంగీతం అందించినప్పుడు దానికి తగ్గ గుర్తింపు రాకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. 65వ జియో ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో తనకు గీత రచయిత సీతారామశాస్త్రి గారికి నామినేషన్ రాకపోవడం పట్ల చిరంతన్ అసంతృప్తి వ్యక్తం చేసాడు. కంచెతో క్రిష్ సినిమా ద్వారానే పరిచయమైన చిరంతన్ తక్కువ సమయంలోనే బాలయ్య కు అభిమాన సంగీత దర్శకుడిగా మారిపోయాడు. దాంతో జైసింహ లాంటి కమర్షియల్ మూవీకి అవకాశం ఇచ్చాడు. అందులో ట్యూన్స్ కు కూడా మంచి పేరే వచ్చింది. దీంతో ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఇతన్నే ఎంచుకున్నాడు బాలయ్య. మరి ఇంత టాలెంట్ ఉన్న చిరంతన్ ను ఫిలిం ఫేర్ కు నామినేట్ చేయకపోవడం వింతే. గెలవడం తర్వాత కనీసం ఇదైనా చేయాలి కదా.

అందుకే తనతో పాటు శాస్త్రి గారి గురించి ప్రస్తావించి మనం ఇంకా కష్టపడి పనిచేయలేమో అంటూ ట్విట్టర్ లో చురక వేసాడు. దీంతో వెంటనే స్పందించిన క్రిష్ మీ ఇద్దరి వల్లే ఇతరులకు నామినేషన్ దక్కించుకునే అవకాశం కలిగిందని చెప్పుకొచ్చాడు. నామినేషన్ తెచ్చుకున్న వాటిలో ఉత్తమ నటుడిగా బాలకృష్ణ పేరు కూడా ఉంది. అయినా ఇలా జరగడం ఇదేమి మొదటిసారి కాదు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే నంది అవార్డులు లాంటి వాటి మీదే బోలెడు వివాదాలు ఫిర్యాదులు ఉన్నాయి. అలాంటిది ఫిలిం ఫేర్ అనేది పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్. అక్కడ ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది అని చెప్పలేం. అందుకే చిరంతన్ మిస్ అయ్యి ఉండొచ్చు. అక్కడ గుర్తింపు వచ్చినా రాకపోయినా చిరంతన్ ఇచ్చిన సంగీతం మాత్రం శాతకర్ణిని చాలా ఎత్తులో నిలబెట్టింది. ప్రేక్షకుల ఆశీర్వాదం కూడా అందుకుంది. అలాంటప్పుడు ఫిలిం ఫేర్ రాకపోవడం అనేది పెద్ద సమస్య కాదు కానీ ఆ మాత్రం గుర్తింపు కోరుకోవడం కళాకారుల కనీస హక్కు. కాదనగలమా.