అందరి ముందు కాజల్ ని పైకి ఎత్తేసిన ఖైదీ..!

0khaidi-no-150-censor-reportమెగాస్టార్‌ చిరంజీవి పునరాగమన సినిమా ఖైదీ నెంబర్‌. 150 ప్రీరిలీజ్‌ కార్యక్రమం శనివారం సాయంత్రం చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఘనంగా జరిగింది. గుంటూరు, కృష్ణ, గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ద్విచక్రవాహనాలతో కుర్రకారు హల్‌చల్‌ చేశారు. హాయ్‌ల్యాండ్‌ ఎదుట జాతీయ రహదారిపై కిలోమీటర్‌ పొడవునా ద్విచక్రవాహనాలను పార్కింగ్‌ చేయడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. అభిమానులు సుమారు కిలోమీటర్‌ దూరం నడిచి సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

మధ్యాహ్నం మూడు గంటలకే ప్రాంగణం నిండిపోయి బ్యారికేడ్లు కూలి పోవడంతో లోపలికి వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. చాలామంది వెనుదిరిగారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో డ్యాన్సలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఏడు గంటలకు తారాగణం తరలి రావడంతో మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిరంజీవి వేదిక మీద ఎంట్రీకి కౌంట్‌డౌన నిర్వహించారు. తొలుత పరుచూరి బ్రదర్స్‌, రఘుబాబు వేదిక మీదకు చేరుకుని ప్రసంగించారు. ఆ తర్వాత దర్శకుడు వీవీ వినాయక్‌, నాగబాబు, ఆలీ వచ్చారు. అన్నయ్య ఈజ్‌ బ్యాక్‌ అని నాగబాబు వ్యాఖ్యానించడంతో సభలో అభిమానులు కరతాళ ధ్వనులు చేశారు. చిరు కుటుంబంపై విమర్శలు గుప్పిస్తోన్న రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌, దర్శకుడు రాంగోపాల్‌వర్మని నాగేంద్రబాబు నిప్పులు చెరిగారు.

సినిమాలో నవరసాలు ఉన్నాయి: చిరంజీవి
చిరంజీవి మాట్లాడుతూ ఖైదీ నెంబర్‌ 150 సినిమాలో డ్యాన్స్‌‌లు, ఫైట్స్‌, వినోదం, రొమాన్స, ఎమోషన్స, కామెడీ, సామాజిక బాధ్యత వంటి అన్ని హంగులున్నాయని తెలిపారు. అదే మాస్‌… అదే క్రేజ్‌, అదే జోరు… అదే హోరుతో సంక్రాంతికి మీ ముందుకొస్తున్నానని అన్నారు మిమ్మల్ని చూస్తుంటే కృష్ణానది పక్కన ఉన్నామా…విశాఖపట్టణంలో సముద్రం పక్కన ఉన్నామా అని అనిపిస్తోందని అన్నారు. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటుంటే ఎంతో ఆనందం కలుగుతోందని, అన్ని పనులు మానుకుని ఇక్కడికి వచ్చిన అభిమానులందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సినిమా కోసం అన్వేషించినప్పుడు తమిళ సినిమా కత్తి తారసపడిందని, తన పునరాగమనానికి అవసరమైన అన్ని హంగులు ఉండటంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. హీరో విజయ్‌ నాకు సినిమా రీమేక్‌ హక్కులు ఇప్పించేందుకు ముందుకొచ్చారని, దర్శకుడు మురుగదాసు సహకరించారని, అలా కత్తి సినిమాని ఖైదీ నెంబర్‌ 150గా రీమేక్‌ చేయడానికి ఎంచుకున్నట్లు చిరు చెప్పారు. నాగబాబు, పవన్ సరసన వీవీనాయక్‌ను భావిస్తోన్నానన్నారు. రాననుకొన్నారా… రాలేననుకొన్నారా… ఢిల్లీకి పోయాడు డ్యాన్సలకు దూరమయ్యాడు, హస్తినకు పోయాడు… హాస్యానికి దూరమయ్యాడు, మా మధ్య లేడు… మాస్‌కు దూరమయ్యాడనుకొన్నారా… లేదు అదే జోరు… అదే హుషారు అని డైలాగ్‌ చెప్పడంతో అభిమానులతో కేరింతలు కొట్టించారు.

చరణ్‌ నిర్మాతగా కూడా సక్సెస్‌ అయ్యాడు..
తన కుమారుడు చరణ్‌ నిర్మాత కూడా సమర్థవంతుడని నిరూపించుకున్నాడని ప్రశంసించారు. తన తనయుడు చరణ్‌ పక్కన హిట్‌ సినిమాల్లో నటించి తన పక్కన నటించడం హీరోయిన్ కాజల్‌కే సాధ్యమైందన్నారు. చిత్ర నిర్మాణం, తన రీఎంట్రీకి సహకరించిన అల్లు అరవింద్‌, జెమిని కిరణ్‌, జీకే మోహన్, సినిమాకి మంచి ట్యూన్స్ అందించిన దేవిశ్రీ ప్రసాద్‌, సాంకేతిక బృందం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు. తన సినిమానే కాకుండా సంక్రాంతికి విడుదలయ్యే బాలయ్య సినిమా, మరో చిన్న సినిమా, అన్ని సినిమాలు సూపర్‌డూపర్‌ హిట్‌ కావాలని చిరంజీవి ఆకాంక్షించారు.

కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్‌ కామినేని శ్రీనివాసరావు, దర్శకులు దాసరి నారాయణరావు, వీవీ వినాయక్‌, హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌, నిర్మాతలు అల్లు అరవింద్‌, టీ సుబ్బిరామిరెడ్డి, సినీ హీరోలు రాంచరణ్‌, అల్లు అర్జున్, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, చిరంజీవి సతీమణి సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజ, నాగబాబు కుమార్తె నిహారిక, తారలు ఆలి, బ్రహ్మానందం, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, తోట తరుణి, గౌతంరాజ్‌, జబర్దస్త్‌ బృందం, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.