కొరియోగ్రాఫర్ మెంబర్ షిప్ ఎలా?

0సినిమా 24 శాఖల్లో అన్ని శాఖల్లో డ్యాన్స్ శాఖకు ఉండే క్రేజే వేరు. దీనిని కొరియోగ్రఫీ అని పిలుస్తుంటారు. నేటి ట్రెండ్ లో కొరియోగ్రాఫర్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కేవలం కొరియోగ్రాఫర్ అయితే చాలు ప్రపంచ దేశాలు చుట్టి రావొచ్చు.. సినిమా పేరుతో. టాలీవుడ్ సినిమాల్లో మెజారిటీ పార్ట్ విదేశాల్లో పాటలు చిత్రీకరించేవే. అందువల్ల మన కొరియోగ్రాఫర్లు ప్రొడక్షన్ పేరుతో విదేశాలన్నీ చుట్టొస్తుంటారు. అదంతా అటుంచితే కొరియోగ్రాఫర్ల పారితోషికాల గురించి వింటే కళ్లు భైర్లు కమ్మాల్సిందే. చిన్నా చితకా అసిస్టెంట్లే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ని మించిన పారితోషికాలు అందుకుంటున్నారు. లక్షల్లో ఖాతాలో వేసుకుంటున్నారు. ఊ అంటే ఫారిన్ టూర్. ఆ అంటే ఫారిన్ టూర్ అన్నట్టే ఉంటుంది వీళ్ల వ్యవహారం. ఈ రంగంలో పని చేసేవాళ్లకు సినిమా ఒక్కటే ఆప్షన్ కాదు. ఇతరత్రా పార్టీలు – సెలబ్రిటీ విందులు – వేడుకల్లోనూ సంపాదించుకునే వీలుంది. అందుకే కొరియోగ్రాఫర్ కావాలంటే ఠఫ్ కాంపిటీషన్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కఠోర సాధకులు మాత్రమే ఈ రంగంలో రాణించగలరు.

అదంతా సరే.. ఇప్పుడున్న డ్యాన్సర్లందరికీ అసోసియేషన్ రూపంలో ఓ వేదిక ఉందా? అంటే ఉందనే చెప్పారు ఓ డ్యాన్స్ మాష్టర్. ఈ ఆఫీస్ శ్రీనగర్ కాలనీ పరిసరాల్లోనే ఉంది. జానీ మాస్టర్ – శేఖర్ మాష్టర్ – రఘు మాష్టర్ – ప్రేమ్ రక్షిత్ మాష్టర్ – సత్య మాష్టర్ ఇలా పలువురు మాస్టర్లు మన టాలీవుడ్ లో ఇప్పటికే నిరూపించుకున్నారు. వీళ్ల కింద అసిస్టెంట్లు బోలెడంత మంది పని చేస్తున్నారు. వీళ్లంతా తిరిగి కొరియోగ్రాఫర్లుగానూ మారుతున్నారు. పలు టీవీ ఈవెంట్లు – సినిమాలకు పని చేస్తూ బాగానే ఆర్జించేవాళ్లున్నారు. అదంతా అటుంచితే కొత్తగా కొరియోగ్రాఫర్ కార్డ్ పొందాలంటే అసోసియేషన్ మెంబర్ షిప్ కి రూ.3లక్షలు కట్టాలని తెలుస్తోంది. డబ్బు కడితే కొరియోగ్రాఫర్ అవుతారా? అంటే ఛాన్సే లేదు. ఎవరు పడితే వాళ్లను సంఘంలో చేర్చుకోరు. పెద్ద స్థాయిలో నిరూపించుకుంటేనే చోటు ఉంటుంది. ఈటీవీ ఢీ వంటి కార్యక్రమాల్లో నెగ్గుకొచ్చి ఉండాలి. ఆ తర్వాత అసిస్టెంట్లుగా చేరి ఆన్ లొకేషన్ పని చేయాలి. అనుభవం రావాలి.. ఆ మేరకు ఓ డ్యాన్స్ మాష్టర్ అసిస్టెంట్ వివరాలు వెల్లడించారు. ఇక ఈ రంగంలో రాజకీయాలు ఎక్కువే. ఎవరైనా ఎదగాలనుకున్నా వెంటనే ఎదిగేయడం కుదరదు. చాలా రకాల టెస్టులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అనుభవ పూర్వకంగా ఓ కొరియోగ్రాఫర్ తెలిపారు. ఇక ఏ ఇనిస్టిట్యూట్ లో చేరాలి? అని అడిగితే.. కృష్ణానగర్ – యూసఫ్ గూడ – శ్రీనగర్ కాలనీలో పలు డ్యాన్స్ ఇనిస్టిట్యూట్లు ఇబ్బడిముబ్బడిగానే వెలశాయి. అయితే వీటిలో నాణ్యంగా ఎవరు క్లాసులు చెబుతున్నారో వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫిలింనగర్లో బన్ని ఇనిస్టిట్యూట్ – అలానే రఘు మాష్టర్ ఇనిస్టిట్యూట్ ఉన్నాయి. రామానాయుడు స్టూడియోస్ ఏరియాలో స్టైల్ ఎన్ స్టైల్ అనే ఇనిస్టిట్యూట్ ఉంది.