టీచర్.. ఇదే నా చివరికోరిక : ఆత్మహత్య లేఖలో ఓ బాలుడు

011-year-old-boy-commits-suicideటీచర్ ఇచ్చిన పనిష్మెంట్‌తో మనస్తాపానికి గురైన ఓ 5వ తరగతి విద్యార్ధి విషంతాగి ఆత్మహత్య చేసుకున్న వైనమిది. గోరఖ్‌పూర్‌లోని సెయింట్ ఆంటోనీ కాన్వెంట్ స్కూల్లో చదువుతున్న 11 ఏళ్ల నవనీత్ ప్రకాశ్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదే తన చివరికోరిక అంటూ బాలుడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘ఇక ఎవరినీ అంత బాగా కొట్టవద్దని మా టీచర్‌కి చెప్పండి ప్లీజ్..’’ అని అందులో రాసి ఉంది. టీచర్ తనను మూడు గంటల పాటు కుర్చీలో నిలబెట్టారనీ.. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని నవనీత్ తన లేఖలో పేర్కొన్నాడు.

ఈ నెల 15న ఎగ్జామ్ ఉందని స్కూలుకు వెళ్లిన పిల్లాడు, తిరిగి వచ్చేటప్పుడు చాలా విచారంగా కనిపించాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం విషం తాగాడని కన్నీరు మున్నీరయ్యారు. సదరు టీచర్ నవనీత్‌ను తీవ్ర మనోవేదనకు గురిచేసినట్టు ఆరోపించారు. టీచర్‌తో పాటు స్కూల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా దీనిపై స్కూల్ యాజమాన్యం ఇప్పటి వరకు నోరు విప్పకపోవడం గమనార్హం.