వైఎస్, చంద్రబాబు బాటలోనే కేసీఆర్

0KCR-Picఅధికారానికి దూరంగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీల నేతలు ప్రజలందరి సమస్యలు తమ సమస్యలుగానే భావిస్తారు. వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తామంటారు. ప్రభుత్వం వారి సమస్యను పట్టించుకోవడం లేదని ఎదురుదాడికి దిగుతారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక మాత్రం స్వరం మారిపోతుంది.

తామే సమస్యలు పరిష్కరిస్తున్నామన్న సంకేతాలిస్తుంటారు. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలోనూ విభిన్నంగానే వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, సీఎం కే చంద్రశేఖర్ రావు అందుకు భిన్నమేమీ కాదు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలని తమ వద్దకు వచ్చిన వివిధ వర్గాల ప్రజలపై పోలీసులను ప్రయోగించడంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విధానాలకు భిన్నంగా కేసీఆర్ విధానాలు నిలువుటద్ధంగా మారాయన్న విమర్శలు ఉన్నాయి.

1999లో బీజేపీతో పొత్తుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2001లో విద్యుత్ చార్జీలు ఇష్టారాజ్యంగా పెంచుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతుల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఇందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

తమ వేతనాలు పెంచడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ‘చలో హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అంగన్ వాడీ కార్యకర్తలపై పోలీసు గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబు సర్కార్‌ది. 2003లో రంగారెడ్డి చేవెళ్లలో రైతులు విత్తనాలు పంపిణీ చేయాలని ఆందోళనకు దిగినప్పుడూ ప్రభుత్వం కాల్పులు జరిపింది. రాజకీయంగా కాంగ్రెస్ తదితర పార్టీలను తమ పార్టీలోకి ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు.

1995 – 2004 మధ్య పలు ప్రజావ్యతిరేక విధానాల అమలుతో ముందుకు సాగిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని 2004 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు సాగనంపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి పోటీ చేయడంతో ఘన విజయం సాధించారు. అంతకుముందు తెలంగాణ నుంచి ఉత్తరాంధ్ర వరకు పాదయాత్ర చేసిన అనుభవంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా పరిధిలో తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణతో నిర్వాసితులైన వారికి అండగా నిలిచిన విపక్ష నేతలను అరెస్ట్ చేయడంలోనే వెనుకాడలేదు. గమ్మత్తేమిటంటే వారంతా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన వారిలో పలువురు ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీలోకి వారిని రప్పించగలిగారు.

2009లో తెలంగాణ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతంలో క్రమంగా టీఆర్ఎస్ బలం పుంజుకున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో ఆ పార్టీ అదినేత కేసీఆర్ సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించారు. కానీ ఎన్నికల ముందు సీఎంగా దళితుడ్ని నిలబెడతానని ఇచ్చిన హామీని పక్కనబెట్టి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. 2002లో చంద్రబాబు నాయుడు చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, జూరాల తదితర ఎత్తిపోతల పథకాలు దాదాపు తుది దశలోకి చేరుకున్నాయి. వీటిని పూర్తి చేస్తున్నామని, ఈ ఘనత తమదేనని పదేపదే చెప్తూ వచ్చారు. ప్రాజెక్టులు రీ డిజైన్ చేసి అంచనాలు పెంచేశారు. వీటికి అవసరమైన భూసేకరణకు 123 నంబర్ జీవో జారీ చేశారు. విపక్షాలు ఎదురు తిరిగాయి. హైకోర్టు తిరస్కరించింది.

కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజులకే వరంగల్ జిల్లా తాడ్వాయిలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో మరణించిన వారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారే కావడం గమనార్హం. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు పోలీసు శాఖకు సీఎం కేసీఆర్ తీవ్రంగా మందలించినట్లు వార్తలు వచ్చాయి. బంగారు తెలంగాణ నిర్మాణం, అభివ్రుద్ధి పేరిట తెలగుదేశం, కాంగ్రెస్ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిలకు కేసీఆర్ ఏమీ తీసిపోలేదు.ఎంపీలు సీహెచ్ మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలతోపాటు దాదాపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ తన పక్షానికి లాగేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ భారీగానే ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ వైపునకు తిప్పుకున్నారు. రాజకీయంగా బలోపేతం కావడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నారు.

నిరుద్యోగుల సమస్య పరిష్కారం పేరుతో జేఏసీ చైర్మన్ కోదండరాం ఆందోళనకు పిలుపునిస్తే ఉక్కుపాదంతో తొక్కేశారు. అంతటితో ఆగలేదు. జేఏసీలో కీలక నేతలను తనకు అనుకులంగా మార్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. జేఏసీ నిరుద్యోగ ర్యాలీ నిర్వహించ తలపెట్టిన కోదండరాం ఇంటిపై అర్థరాత్రి దాడికి దిగిన పోలీసులు ఇష్టారాజ్యంగా విధ్వంసకాండకు పాల్పడి అరెస్ట్ చేసి అభాసు పాలయ్యారు. ప్రభుత్వానికీ మచ్చ తెచ్చారు. రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గం మనోభావాలను దెబ్బ తీశారన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కానీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వోద్యోగాలు కల్పించడంలో సీఎం కేసీఆర్ మీన మేషాలు లెక్కించారన్న ఆరోపణలు ఉన్నాయి. 15 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినా ఇప్పటివరకు ఎనిమిది వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇటీవల జరిగిన ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల ప్రారంభ వేడుకలో సీఎం కేసీఆర్ ప్రసంగించేందుకు వెనుకంజ వేశారు. విద్యార్థుల నిరసనకు కారణాలు తెలుసుకుని ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా మిర్చి రైతులు గిట్టుబాటు ధర పెంచాలని కోరుతూ ఖమ్మం మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగితే రాజకీయం అని విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. రాజకీయ రౌడీలే ఈ దారుణానికి తెగబెడ్డారని ఆరోపణలు మండిపడ్డారు. రైతులపై తీవ్రమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. అంతటితో ఆగక.. రెండు రోజుల క్రితం ఖమ్మం సబ్ జైలు నుంచి రిమాండ్‌లో ఉన్న ఖైదీలను బేడీలు వేసి కోర్టుకు తీసుకు వచ్చారు. ఇది తెలిసి మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. విపక్షాలు మండిపడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంఘ విద్రోహ శక్తులకు మాత్రమే బేడీలు వేయాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి ఉంటేనే తప్ప మిగతా ఖైదీలకు సంకెళ్లు విధించరాదన్న సంగతి విస్మరించి ఖమ్మం పోలీసులు చేసిన పనితో జరిగిన నష్టం నివారణకు చర్యలు తీసుకున్నారు. కానీ అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగిపోయిందని రాజకీయ విమర్శకులు చెప్తున్నారు.