వీళ్లసలు తెలంగాణ బిడ్డలేనా..: కేసీఆర్

0KCR - Copyముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నామని వ్యాఖ్యానించారు. చిల్లర రాజకీయాల కోసం కాంగ్రెస్ నేతలు నీచంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతీ పనిని అడ్డుకుంటోవడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు 196 కేసులు వేశారని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక అధికారం ఆశించి భంగపడ్డారన్న ఆయన, కాంగ్రెస్ నేతలు తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించారు. నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేసే ఆ పార్టీ నేతలకు.. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు కనిపించడం లేదా? ప్రశ్నించారు. ప్రతీ దానిని అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు కేసుల పురాణం మొదలుపెట్టారని మండిపడ్డారు. నీటి ప్రాజెక్టులు అడ్డుకోవడానికి కేసులు వేస్తున్నారు, ఉద్యోగాల నోటిఫికేషన్లపైనా కేసులు వేస్తున్నారు.. తెలంగాణ అభివృద్ధి వీరికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక్క రోజులో ఆరు కేసులు వేశారన్న ఆయన, వారి దురాలోచనను గ్రహించిన న్యాయస్థానాలు కాంగ్రెస్ నేతలకు మొట్టికాయలు వేశాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న వీళ్లు అసలు తెలంగాణ బిడ్డలేనా అని నిప్పులు చెరిగారు.