విభజన చాలా బాధాకరం – కిరణ్ కుమార్ రెడ్డి

0

cm-kiranకాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఏపి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి మీడియా ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఈ రోజు ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. మీడియాతో మాయన మాట్లాడుతూ ‘ రాష్ట్ర విభజన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ మాత్రమె తీసుకున్నది. దాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతించాల్సిన అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రిగా రెండు ప్రాంతాల్లో ఉన్న సమస్యల్ని చూసిన వాన్ని కాబట్టి కేంద్రాన్ని బయపెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. అలాగే హైదరాబాద్ పై కేంద్రం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ఇవ్వాలి. రాజధానిలోనే విద్య, ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి. కావున చాలా మంది ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ఆమోదం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి సీమాంధ్రులు వెళ్ళాల్సి వస్తే 610 జీవో ప్రకారం కేవలం 18,856 మంది మాత్రమే వెళ్ళాలి, అందులోనూ ఇప్పటికి చాలా మంది మినహాయింపును సంపాదించుకున్నారు. ఆందోళనలు చేస్తే రాష్ట్రాలు ఇవ్వరు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇలా అందరూ రాష్ట్ర అభివృద్దికి కృషి చేసారు. అలాంటిది వారి విగ్రహాలను, కొంత్తమంది జాతీయ నాయకుల విగ్రహాలను ద్వంసం చేయడం చాలా బాధాకరం. నేనురాష్ట్ర విభజనకు అనుకూలం కాదు అలాగే వ్యతిరేఖిని కాదు. కానీ రాష్ట్ర విభజన చేస్తే చాలా విషయాల్లో సమస్యలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ముందుగా వాటన్నిటికీ సరైన సమాధానం చెప్పిన తర్వాతే కార్యాచరణకు వెళ్ళాలి. అ తర్వాతే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలి. అల్లాగే ఏపీ ఎన్జీవోలు ఇచ్చిన సమ్మె నోటీసును వెనక్కి తీసుకోవాలి.

త్వరలోనే ఆంటోనీ కమిటీ ఇక్కడికి వస్తుందని అప్పుడు ఈ ఉద్యోగస్తులంతా తమ సమస్యలను అక్కడ చెప్పుకోవాలి. సీపీఎం, మజ్లీస్ పార్టీలు మాత్రమే రాష్ట్ర విభజనకి వ్యతిరేఖంగా ఉన్నాయని మిగతా అన్ని పార్టీలు రాజకీయ స్వలాభం కోసం దొంగనాటకాలు ఆడుతున్నాయి. కెసిఆర్ చత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్ తీసుకొస్తామని చెప్పిన వార్తల్లో వాస్తవం లేదని’ ఆయన అన్నారు.