కోడిపందేలపై హైకోర్టు ఉత్తర్వులు..మరింత వేడెక్కిన వ్యవహారం

0cock-fight-high-courtపాలకొల్లు: కోడిపందేలపై హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. ఇప్పుడు ఎవరినోట విన్న ఇదే చర్చ. ఎటువంటి పరిస్థితుల్లో సంక్రాంతి పండగ రోజుల్లో కోడిపందేలు, జూదాలు జరగనివ్వమని పోలీసు, రెవెన్యూ అధికారులు కరాఖండిగా చెబుతుండగా.. చివరకు ఎలాగైనా వేసి తీరతామంటూ పందేల నిర్వాహకులు పావులు కదుపుతున్నారు. మరోపక్క పందేలకు రాజకీయ పైరవీలు నడుస్తున్నాయి. ఈసారి సుప్రీం కోర్టును ఆశ్రయించి గతంలో మాదిరిగానే జరిగే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంతో అందరిచూపు పందేలపైనే పడింది.

జిల్లాలో ఏటా పందేలను నియంత్రిస్తామంటూ పోలీసు అధికారులు చెబుతున్నా చివరకు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గక తప్పడంలేదు. సంక్రాంతి వస్తుందంటే చాలు నెలరోజుల ముందునుంచే కోడిపందేలు, గుండాట, మూడుముక్కలాట, పేకాట వంటి జూదం ఆటల నిర్వహణకు ఏర్పాట్లు మొదలుకావడం ఆనవాయితీ. రూ.కోట్లు చేతులు మారుతుంటాయి. ఈసారి సంక్రాంతి పండగ రోజుల్లో జరిగే కోడిపందేలు, అసాంఘిక కార్యకలాపాలపై ఉచ్చు బిగుసుకునే పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఎటువంటి పరిస్థితుల్లో కోడిపందేలను సైతం నిర్వహించరాదని, ఒకవేళ జరిగితే ప్రభుత్వంతో పాటు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు బాధ్యులని తేల్చింది. ఈ పరిణామాలతో తాజాగా కొందరు ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఏటా కోడిపందేలు, అసాంఘిక కార్యకలాపాలు కొందరి ప్రజాప్రతినిధుల కనుసైగల్లోనే జరుగుతున్న బాగోతం అందరికీ తెలిసిందే. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో శాసనసభ్యులే నేరుగా వీటిని ప్రోత్సహిస్తుంటారు. రెండు మూడు చోట్లయితే కోడిపందేల బరుల్లోనే కోళ్లను పట్టుకుని మన సంక్రాంతి పండుగ సంప్రదాయ ఆటగా చెబుతుంటారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఓ రాష్ట్ర మంత్రి అయితే కోడిపందేల గురించి మాట్లాడుతూ కోర్టును గౌరవిస్తాం… మన సంప్రదాయాన్ని కొనసాగిస్తామంటూ పలికారు. దీంతో కోడిపందేలు, జూదం నిర్వాహకులు ఆ మాటలు జరుగుతాయనడానికి సంకేతాలుగా భావించి సంబరపడిపోయారు. అన్నిచోట్ల ప్రజాప్రతినిధులు, నాయకులు అండదండలతో సాగే ఈ పందేలను ఈసారి విచ్చలవిడిగా నిర్వహించేలా ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు. కోడిపందేలా నిర్వాహకులు ఆయా బరుల ప్రాంతాల్లో గుండాట, పేకాట, మూడుముక్కలు, మద్యం అమ్మకాలు, ఇతర దుకాణాల ఏర్పాటుకు వీటి నిర్వహణదారులు కొంత సొమ్ము ఇచ్చేలా బేరసారాలు కుదుర్చుకున్నారు. ముందస్తుగా కొంతసొమ్మును తీసుకున్నారు. పోటీగా ఉన్న ప్రాంతాల్లో వేలంపాటను సైతం నిర్వహించారు. ఇప్పుడు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సీరియస్‌గా కదలడంతో కొందరు ప్రజాప్రతినిధులు జరిగేందుకు అన్ని రకాల ప్రయత్నాలపైనా దృష్టిపెట్టారు. గతంలో ఇటువంటి పరిస్థితులే ఎదురైనప్పుడు ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం ధర్నాలు, ఆందోళనలకు దిగి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో పోలీసులకు చూసీచూడనట్లుగా వదిలేయమని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందడంతో మిన్నకుండిపోయారు. ఈసారీ అటువంటి పరిస్థితులే వస్తాయని వినిపిస్తోంది. ఇప్పుడు హైకోర్టు నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంటే మినహా కోడిపందేలను అరికట్టలేరనేది స్పష్టం. అలాకాదని వదిలేస్తే హైకోర్టు అదేశాలకు పూర్తిగా అర్థం లేకుండా పోయినట్లే అవుతుందని, కోర్టును తప్పుదోవ పట్టించినవారవుతారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

బైండోవర్‌ కేసులు

ఇప్పటికే పోలీసు, రెవెన్యూ అధికారులు కలిసి గతేడాది పందేల నిర్వాహకులపై బైండోవర్‌ కేసులు నమోదు చేయడంతోపాటు స్థల యాజమానులకు తాఖీదులు జారీ చేశారు. ఈ పరిణామాలతో పందెం నిర్వాహకుల్లో ఒకింత అనుమానం వెంటాడుతున్నా చివరిదశలో అనుమతి వస్తుందిలేననే ధీమా వ్యక్తపరుస్తుండడం గమనార్హం. జిల్లాలో పందేల పరిస్థితులు ఇలా ఉంటే మరోపక్క ఏటా ఇతర జిల్లాలు, రాష్ట్రాలు నుంచి వచ్చే పందెంరాయుళ్లు ఆసక్తిగా ఏంజరుగుతుందోనని ఎప్పటికప్పుడు చరవాణీల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు.