రాజబాబు.. శివాజీ గణేశన్.. ఒక కారు కథ

0

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప హాస్య నటుల్లో ఒకరు రాజబాబు. చాలా తక్కువ వ్యవధిలో ఆయన శిఖర స్థాయిని అందుకున్నారు. దాదాపు 600 చిత్రాల్లో నటించిన రాజబాబు.. తెలుగు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తారు. అప్పట్లో ఆయన దక్షిణాదిన అత్యంత డిమాండ్ ఉన్న కమెడియన్లలో ఒకరు. రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో విరామం లేకుండా పని చేసిన ఘనత ఆయనది. దీనికి తగ్గట్లే ఆదాయం కూడా గొప్పగానే ఉండేదట. తన కొడుకు మేడ మీది నుంచి రోడ్డు మీద పోతున్న లగ్జరీ కారు చూసి ముచ్చట పడితే.. వెంటనే ఆ కారు సంగతేంటో కనుక్కుని కొన్ని గంటల్లో దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారట ఓ సందర్భంలో. ఆ కారు శివాజీ గణేశన్ ది కావడం విశేషం. ఈ కారు కథను ఆలీ నిర్వహించే ఒక టీవీ షోలో రాజబాబు సోదరుడు చిట్టిబాబు పంచుకున్నాడు.

ఒక రోజు రాజబాబు తన పిల్లలతో కలిసి చెన్నైలోని తన ఇంట్లో మేడ మెట్లపై కూర్చుని ఉన్నారట. అప్పుడే శివాజీ గణేశన్ కొన్న కొత్త ఎర్ర కారు రోడ్డుపై వెళ్లిందట. ‘డాడీ అలాంటి కారు ఎప్పుడు కొంటావ్’ అడిగాడట వాళ్లబ్బాయి. ఆ కారు నీకు కావాలని అని అడిగిన రాజబాబు.. వెంటనే శివాజీ ఇంటికి బయల్దేరాడట. లుంగీ.. చొక్కా మీదే ఆయన ఇంటికి వెళ్లిపోయాడట. అప్పుడు శివాజీ.. కుశల సమాచారం అడిగిి ఏంటి ఈ సమయంలో ఇలా వచ్చావు అని అడిగితే.. నాకు ఆ కారు కావాలి అని చెప్పేశాడట రాజబాబు. అది లక్ష రూపాయలు (ఇప్పుడు కోట్ల రూపాయలతో సమానం) అని శివాజీ చెప్పగా.. ఆ డబ్బు ఇచ్చేస్తా కారు ఇచ్చేయండి అని బదులిచ్చాడట రాజబాబు. శివాజీ ఓకే అనడంతో వెంటనే కారు తీసుకొచ్చేసి పిల్లల్ని అందులో రెండు రౌండ్లేయించి షెడ్డులో కారు పెట్టేసుకున్నాడట. తర్వాతి రోజు తన అకౌంటెంట్ ను పంపి శివాజీకి రూ.25 వేలు చేరేలా చేశాడట. నీకెందుకు ఇంత పెద్ద కారు అని శివాజీ ఇంకోసారి అడిగితే.. మీ కారు రోడ్డు మీద వెళ్లేటపుడల్లా పిల్లలు అడుగుతున్నారు. వారి కోరిక తీర్చకపోతే నేను ఎంత సంపాదించి ఏం లాభం అని బదులిచ్చారట రాజబాబు.
Please Read Disclaimer