బీజేపీకి సీట్లు ఎక్కువైనా…ఓట్లు తక్కువే!

0కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించిన సంగతి తెలిసిందే. కన్నడ నాట బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా…సొంతగా అధికారం చేపట్టే అవకాశం లేకుండా పోయింది. కర్ణాటకలోని 222 స్థానాలకు గానూ….బీజేపీకి 104 – కాంగ్రెస్ కు 78 – జేడీఎస్ కు 38 – ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. బీజేపీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయిందని ఆ పార్టీ నేతలు భావించారు. కన్నడ ప్రజలు…మోదీకి నీరాజనాలు పలికారనుకున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ వెల్లడించిన గణాంకాలు చూస్తే బీజేపీ నేతలు నివ్వెరబోవాల్సిందే. బీజేపీకి పోలైన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ కు పోలైన ఓట్ల శాతం ఎక్కువని ఈసీ అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది. కాంగ్రెస్ కన్నా బీజేపీకి దాదాపుగా రెండు శాతం ఓట్లు తక్కువ పోలయ్యాయని ఈసీ తెలిపింది.

2014లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన టీడీపీకి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి ఓట్ల శాతంలో తేడా కేవలం 2 శాతమే. కాకతాళీయమే అయినప్పటికీ….కర్ణాకటలో కూడా బీజేపీకి – కాంగ్రెస్ కు ఓట్ల శాతంలో తేడా దాదాపు రెండు శాతం ఉండడం గమనార్హం. కర్ణాటక ఎన్నికల్లో 78 స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్ కు 38 శాతం ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో 104 స్థానాలలో విజయం సాధించిన బీజేపీకి 36.2 శాతం ఓట్లు పోలవడం నిజంగా ఆశ్చర్యకరమే. 38 స్థానాలలో గెలుపొందని జేడీఎస్ కు 18.4 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే ఓట్ల శాతం ఎక్కువగా ఉండి తక్కువ సీట్లు గెలుచుకోవడం…అదే సమయంలో ఓట్ల శాతం తక్కువగా ఉండి ఎక్కువ సీట్లు గెలుచుకోవడం నిజంగా విచిత్రమే. ఈసీ వెల్లడించిన గణాంకాలను బట్టి కన్నడ ప్రజలు బీజేపీ కన్నా కాంగ్రెస్ నే ఎక్కువగా నమ్మారని తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే కన్నడ ప్రజలకు కాంగ్రెస్ ను గెలిపించాలన్న కోరిక బలంగా ఉందని చెప్పవచ్చు. కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లు….బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం వెనుక కూడా అనేక కారణాలున్నాయి. దీంతో బీజేపీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ …మెజారిటీ సీట్లు ఆ పార్టీకే దక్కాయి.