పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు 6.81 లక్షల ఇళ్లు నిర్మాణం

0nara-lokesh-in-janma-bhoomiనెల్లూరు : పట్టణాల్లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం రూ. 38వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో సోమవారం విస్తృత పర్యటన జరిపిన ఆయన నెల్లూరు నగరంలో షీర్‌వాల్‌ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఎన్టీఆర్‌ ఇళ్లను పరిశీలించారు. అనంతరం కావలి ప్రాంతంలోని తుమ్మలపెంటలో జరిగిన జన్మభూమి-మాఊరు గ్రామసభలో పాల్గొన్నారు. అనంతరం కావలిలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ…‘ఇటీవలే సొంత ఇల్లు కట్టుకునేందుకు 20 నెలలు పట్టింది. అప్పుడే తెలిసింది

ఇంటి నిర్మాణం ఎంత కష్టమోనని. అందుకనే పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు 6.81 లక్షల ఇళ్లు నిర్మించేందుకు రూ. 38వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అని ప్రకటించారు. నెల్లూరు నగరంలో నిర్మిస్తున్న షీర్‌వాల్‌ టెక్నాలజీ ఓ అద్భుతమని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పల్లెల్లో ఇప్పటి వరకు 14వేల కిలోమీటర్ల వరకు సీసీ రోడ్లు నిర్మించామన్నారు. కేంద్ర, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రిగా పని చేసిన వెంకయ్యనాయుడు రెండు లక్షల ఇళ్లు రాష్ట్రానికి ఇచ్చారని, ఇది ఎంతో హర్షించదగ్గ విషయమని లోకేశ్‌ పేర్కొన్నారు. 67 ఏళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు యువకుడిలా స్పీడ్‌గా పరుగులు పెడుతున్నారని, ఆయన్ను అందుకోవడం ఎంతో కష్టంగా ఉందన్నారు.

మహా నగరాల్లో 40 అంతస్తులు, 400 అడుగుల ఎత్తులో నిర్మించే ఇళ్లకే షీర్‌వాల్‌ టెక్నాలజీ ఉపయోగించేవారని, అలాంటిది చంద్రబాబు పేదల ఇళ్ల కోసం ఆ టెక్నాలజీని ఉపయోగించి నాణ్యమైన ఇళ్లు నిర్మిస్తున్నారన్నారు. కొందరు కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చు పెడుతున్నారని, మనం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఐటీ చాలా ఇబ్బందుల్లో ఉందని, కానీ 2019 నాటికి ఒక లక్ష ఉద్యోగాలు అందిస్తామని, ఎలకా్ట్రనిక్స్‌ ద్వారా మరో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆలోచన సాగుతోందన్నారు. ఇప్పటికే ఐటీ రంగం ద్వారా 16వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా నెల్లూరు జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వస్తాయని ఆయన వెల్లడించారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వాటర్‌ గ్రిడ్‌ ప్రోగ్రాంను తీసుకువస్తున్నట్టు చెప్పారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానంతో సాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు.