మన నోటు ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో తెలిస్తే షాకవుతారు

01000-rupee-notesపెద్దనోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకూ రూ.12లక్షల కోట్ల విలువైన కొత్త నోట్లను ఆర్‌బీఐ విడుదల చేసిందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఫిబ్రవరి 24 వరకు ఆర్‌బీఐ ఇచ్చిన సమాచారం మేరకు రూ. 11లక్షల 64వేల 100 విలువైన కొత్త నోట్లు చలామణీలోకి వచ్చాయని, ఆ సంఖ్య ప్రస్తుతం రూ.12లక్షలకు చేరుకుని ఉంటుందని తెలిపారు.

రద్దైన పాత రూ.500, రూ.1000 నోట్ల జమ గురించి వచ్చిన అనుబంధ ప్రశ్నపై ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతం జమ అయిన ప్రతి నోటునూ నిశితంగా పరిశీలిస్తున్నారని, ఇందుకోసం పెద్దఎత్తున ప్రక్రియ నడుస్తోందని తెలిపారు. అందువల్ల సభకు ఇప్పట్లో ఆ వివరాలు వెల్లడించలేమన్నారు. ఒకసారి ఆర్‌బీఐ నుంచి సమాచారం అందాక ఆ వివరాలను సభకు తెలియజేస్తామన్నారు. ఇక కరెన్సీ నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చు గురించి మాట్లాడుతూ ఏటా ముద్రణా ఖర్చుల్లో వివిధ కారణాల రీత్యా మార్పు చోటుచేసుకుంటోందని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.500 నోటు(పాత లేదా కొత్త)కు రూ.2.87 నుంచి రూ.3.09లు, రూ.2000 నోటుకు ఇంచుమించు రూ.3.34 నుంచి రూ.3.77లు ఖర్చవుతోందని పేర్కొన్నారు.