విజయవాడ కోర్టు సంచలన తీర్పు

0court-confirms-life-sentencకొంతమంది యువతులకు మత్తు మందు ఇచ్చి.. వారిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొలుత ఈ కేసులో ఓ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను కోర్టు దోషులుగా తేల్చింది.

బుధవారం నాడు కేసు తుది విచారణ సందర్బంగా.. వారికి శిక్షలు ఖరారు చేసింది. కేసులో ఏ-1 నిందితుడు నిమ్మకూరి సాయిరామ్ కు కోర్టు యావజ్జీవ శిక్ష విధించగా.. మిగతా నిందితులు దీపక్, అభిలాష్, మున్నాలకు 20ఏళ్ల చొప్పున శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. మరో మైనర్ నిందితుడికి మూడేళ్లపాటు శిక్ష విధించింది.

రెండేళ్ల క్రితం ఆగస్టు 23,2014లో ఈ సంఘటన వెలుగుచూసింది. నిందితులంతా విజయవాడకు చెందినవారే కాగా.. వీరంతా కలిసి కొంతమంది యువతులకు మత్తు మందు ఇచ్చి, ఆపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అత్యాచారం చేయడమే గాక ఆ తతంగాన్నంతా వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో ఐదుగురు దోషులుగా తేలడంతో విజయవాడ కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది.