దర్శకరత్న దాసరి కన్నుమూత

0Dasari-Narayana-Raoప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు(75) కన్నుమూశారు. గత నాలుగు రోజులుగా కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జనవరిలో ఆయన అన్నవాహిక, మూత్రపిండాలు, వూపిరితిత్తుల్లో సమస్యలతో అస్వస్థతకు గురయ్యారు. శస్త్రచికిత్స అనంతరం మళ్లీ ఇన్‌ఫెక్ష్‌న్‌ సోకడంతో దాసరి నాలుగురోజుల క్రితం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం కిమ్స్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దాసరి కన్నుమూశారు.

దాసరి నారాయణరావు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 1942 మే 4న మహాలక్ష్మి, సాయిరాజ్‌ దంపతులకు జన్మించారు. నాటక రంగం నుంచి సినీ రంగ ప్రవేశం చేశారు. ‘తాతా మనవడు’ చిత్రంతో దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా తన ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, వంటి అగ్రనటులతో సినిమాలు తీసిన దాసరి జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్నో చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా ఎన్నో కీర్తి ప్రతిష్ఠలు అందుకున్నారు. ఆయనకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్‌ ఉన్నారు.

దాసరి తీసిన అపురూప చిత్రాలు
నటుడిగా కెరీర్‌ ఆరంభించిన దాసరి దర్శకుడిగా తనదైన ముద్రవేశారు. ‘తాత-మనవడు’ చిత్రంతో తొలిసారి మెగాఫోన్‌ పట్టిన ఆయన 150కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ‘దర్శకరత్న’ అనిపించుకున్నారు. ‘శివరంజని’, ‘ప్రేమాభిషేకం’, ‘మేఘ సందేశం’, ‘గోరింటాకు’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘బొబ్బలిపులి’ ‘ఒసేయ్‌ రాములమ్మ’ తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కొన్ని అవార్డులు
* దర్శకుడిగా తొలి చిత్రం ‘తాత-మనవడు’(1974)కు నంది అవార్డు.
* ‘స్వర్గం-నరకం’ చిత్రానికి బంగారు నంది.
* ‘మేఘ సందేశం’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు(1982).
* మామగారు చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు(1992).
* ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ‘కళా ప్రపూర్ణ’ గౌరవ పురస్కారం
* 2007లో ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు.
* 2009లో శోభన్‌బాబు తొలి స్మార పురస్కారం.