ఎన్టీఆర్‌కు దాసరి పాదాభివందనం

0


dasari-sardar-paparayuduమది దోచే.. మరుపురాని.. యుగళ.. కళాత్మక.. సందేశాత్మక చిత్రాలతో వెండితెరకు విలువను చేకూర్చిన దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇక లేరు. మంగళవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై దివంగతులయ్యారని తెలిసి చలనచిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. తెలుగు తెరకు వెలుగు నింపిన ఈ శతాధిక చిత్ర దర్శకుడికి తెలుగుజాతి ‘అన్నగారు’ ఎన్టీఆర్‌తో ప్రత్యేక అనుబంధం ఉండేది.  ‘మనుషులంతా ఒక్కటే’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘సర్కస్‌ రాముడు’, ‘విశ్వరూపం’, ‘బొబ్బిలి పులి’ వంటి చిత్రాలను దాస‌రి ఆయనతో తీశారు.  వారిద్ద‌రి  మధ్య ఉన్న ఆత్మీయత గురించి దాసరి ఒకానొక సంద‌ర్భంలో ఇలా  ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు..

మాటల్లో చెప్పలేను
ఎన్టీఆర్‌తో నా అనుబంధాన్ని మాటల్లో చెప్పలేను. ఎందుకంటే మా మధ్యన ఉంది ‘అనురాగ బంధం’. ప్రతి దశలోనూ నా క్షేమాన్ని కోరిన మహానుభావుడు ఆయన. దర్శకుడిగా రాణించే లక్షణాలు నాలో ఉన్నాయని గుర్తించి ఆ సంగతి పదిమందికీ ఘనంగా చెప్పింది ఆయనే. దర్శకులు భీమ్‌సింగ్‌ వద్ద ‘ఒకే కుటుంబం’ చిత్రానికి సహాయకుడిగా ఉన్నప్పుడు ఓ సందర్భంలో నేను కొన్ని సన్నివేశాలు చిత్రించాల్సి వచ్చింది. అలా తొలిసారి సూచనలిచ్చి చిత్రీకరణ చేసింది ఎన్టీఆర్‌ పైనే. అప్పట్నుంచి ఆయన నన్ను ఎంతో అభిమానించేవారు.

అందుకే ఐదు చిత్రాలు
నేను ఎన్టీఆర్‌తో ఐదే చిత్రాలే తీయడానికి ప్రత్యేక కారణమేమీ లేదు. కథానాయకుడు, నిర్మాత, దర్శకుడిగా ఆయన ఎప్పుడూ తీరిక లేకుండా ఉండేవారు. దర్శకత్వ శాఖలో నేనూ బిజీగానే ఉండేవాడిని. మా ఇద్దరి వీలును బట్టి ఆ ప్రాజెక్టులు కుదిరాయి. ఈ రోజు మనం వింటున్న సామాజిక న్యాయం అనే మాటకు అంతరార్థం ‘మనుషులంతా ఒక్కటే’ ద్వారా చెప్పాం. ‘దున్నే వాడిదే భూమి. పండించే వాడే ఆసామి’ అని అప్పుడే చెప్పాం.

రామారావుతో యుగళగీతం లేకుండా సినిమా తీసిందీ నేనే. ఆ తర్వాత ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘బొబ్బిలిపులి’ ఎలాంటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. దర్శకులను నమ్మే వ్యక్తి కాబట్టే యుగళగీతం లేకుండానే నా సినిమాలో నటించారు. బొబ్బిలిపులిలో పాత్ర ఏమిటో ఫోన్‌లో చెప్పాగానే సినిమా ఒప్పుకొన్నారు. క్లాప్‌ ఇచ్చిన తర్వాత కథ అడిగి సంక్షిప్తంగా తెలుసుకున్నారు. ఆయనకు నేనంటే అంత నమ్మకం.

మరిచిపోలేను
‘సర్దార్‌ పాపారాయుడు’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వూటీలో చిత్రించాం. ఫాగ్‌ ఎఫెక్ట్‌లో ఆయన అల్లూరి సీతారామరాజు గెటప్‌లో నడిచి వస్తుంటే నా ఒళ్లు పులకరించింది. వెంటనే వెళ్లి పాదాభివందనం చేశా. నేను ఎన్టీఆర్‌కు పాదాభివందనం చేసింది అప్పుడే! ‘ఏమిటి నారాయణరావు గారు.. ఇదీ’ అన్నారు. మీలో ఆ మహానుభావుణ్ని చూశాను అన్నాను. ‘సరే నారాయణరావు గారు.. అంతటి మహానుభావుల గురించి ఇప్పుడు మనం చెప్పుకొంటున్నాం. మన తర్వాతి తరాలు మన గురించి ఏమైనా చెప్పుకొంటారా’ అని అడిగారు. ప్రజాసేవ చేస్తే తప్పకుండా గుర్తుంచుకుంటారు అని బదులిచ్చాను.

ఆ సాయంత్రమే ప్రెస్‌మీట్‌ పెట్టి నెలలో సగం రోజులు ప్రజాసేవకు అంకింతం చేస్తానని చెప్పారాయన. వారం రోజుల తర్వాత చూస్తే రాజకీయాల్లోకి రావాలని గోనె సంచుల్లో వేలకొద్దీ వేలకొద్ది వచ్చిన ఉత్తరాలను నాకు చూపించారు. ‘ప్రజలు నన్ను రాజకీయాల్లోకి రమ్మంటున్నారు’ అని అన్నారు. ఆ క్షణమే ఎన్టీఆర్‌ రాజకీయ జీవితానికి బీజం పడింది. ఆ సంఘటల్ని నేను మరిచిపోలేను. ఇక నా పుట్టిన రోజున అక్షతలు తీసుకొని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.