దాసరి తీయలేకపోయిన ఆ సినిమాలు..

0చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి చెంది ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాదిలో ఇండస్ట్రీ జనాలతో పాటు సామాన్యులు ఎంతమంది ఎన్నిసార్లు ఆయన పేరు తలుచుకుని ఉంటారో లెక్కలేదు. ఇండస్ట్రీలో ఏ సమస్య తలెత్తినా ఆయనే గుర్తుకొచ్చారు. డ్రగ్స్ కుంభకోణం.. శ్రీరెడ్డి ఇష్యూ ఇండస్ట్రీని కుదిపేసినపుడు దాసరి లేని లోటు గురించి ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. దాసరి ఉన్నపుడు ఇండస్ట్రీ బాగు కోసం ఆయన పడ్డ ఆరాటం అలాంటిది మరి. ఇక దర్శకుడిగా ఆయన వేసిన ముద్ర గురించి ఏమని చెప్పాలి? ఏకంగా 150 సినిమాలతో చరిత్ర సృష్టించారాయన. దాదాపు పాతికేళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యం చలాయించిన దాసరి.. కొత్త శతాబ్దంలో మాత్రం జోరు తగ్గించేశారు. స్థాయికి తగ్గ సినిమాలు చేయలేదు. ఆయన తీసిన సినిమాలన్నీ నిరాశ పరిచారు.

అలాగని దాసరి పూర్తిగా సినిమాలు మానేయాలని అనుకోలేదు. దర్శకుడిగా.. నిర్మాతగా కొన్ని సినిమాలు చేయడానికి సన్నాహాలు చేశారు. జీవిత చరమాంకంలో వాటి పనుల్లో బిజీగా ఉన్నారు. మహాభారత కథను సినిమాగా తీయాలన్నది ఆయన కల. అందుకోసం కొన్నేళ్ల నుంచి రచయితల బృందంతో కలిసి కష్టపడుతున్నారాయన. ఈ కథను ఐదు భాగాలుగా తీయాలని దాసరి భావించారు. స్క్రిప్టు వర్క్ కూడా జరుగుతోందని రెండేళ్ల కిందట ప్రకటించారు. మరోవైపు జయలలిత జీవిత కథతో ‘అమ్మ’ అనే సినిమాను కూడా దాసరి అనౌన్స్ చేశారు. ఆ చిత్రానికి స్క్రిప్టు వర్క్ మొదలైంది. కానీ అదీ కార్యరూపం దాల్చలేదు. ఇంకోవైపు ‘పితృదేవోభవ’.. ‘స్వామి అయ్యప్ప మహాత్మ్యం’.. ‘అసెంబ్లీలో దొంగలు పడ్డారు’ పేర్లతో సినిమాలు తీయాలని కూడా దాసరి సంకల్పించారు. కానీ అవి కూడా కలగానే మిగిలిపోయాయి. దాసరి అనారోగ్యం పాలు కాకుంటే ఈ సినిమాలన్నీ వచ్చేవేమో.