డిగ్రీ కాలేజీ ట్రైలర్ టాక్ హద్దులు మీరిన బోల్డ్ నెస్

0

ఇది ఏ సినిమా ప్రభావమో లేక యూత్ వేలం వెర్రిగా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తారన్న భ్రమో తెలియదు కానీ రాను రాను దర్శకుల ఆలోచనలు టాలీవుడ్ ని ఎటో తీసుకెళ్లిపోతున్నాయి. అందులో అభిరుచి కలిగిన దర్శకులు సైతం అదే బాటలో వెళ్లడమే ఇక్కడ బాధించే విషయం. 1940లో ఒక గ్రామం-లజ్జ-కమలతో నా ప్రయాణం లాంటి అభిరుచి కలిగిన సినిమాల దర్శకుడిగా పరిచయమున్న నరసింహ నంది కొత్త సినిమా డిగ్రీ కాలేజీ ట్రైలర్ నిన్న విడుదల చేశారు.

కంటెంట్ విషయానికి వస్తే డిగ్రీ కాలేజీలో చదివే హీరో హీరోయిన్లు ఒకరి నొకరు ప్రేమించుకుంటారు. అబ్బాయి తక్కువ స్థాయికి చెందినవాడు. అమ్మాయి పోలీస్ ఆఫీసర్ కూతురు. కట్ చేస్తే వ్యవహారం తెలిసి హీరోయిన్ డాడీ హీరో వెంట పడతాడు. ప్రేమికులు ఇద్దరూ ధీటుగా నిలబడతారు. అంతేనా ప్రేమ పేరుతో ఎంత చేయాలో అంతా చేసి ఏ హద్దులు దాటకూడదో అవన్నీ శుభ్రంగా కానిచ్చేస్తారు

బేస్డ్ ఆన్ రియల్ ఇన్ సిడెంట్స్ అన్నారు కానీ ఇది ఫక్తు ఇడియట్ కథనే. దానికే బోల్డ్ సీన్లు లిప్ లాక్ కిస్సులు పెట్టి మమ అనిపించారు. ఓపెన్ గా నటించారు కానీ వరుణ్ శ్రీదివ్యలలో యాక్టింగ్ స్కిల్స్ పెద్దగా కనిపించలేదు. కీలకమైన పోలీస్ ఆఫీసర్ గా చేసిన నటుడు సైతం నటించాడో జీవించాడో అర్థం కానంత వెరైటీగా కానిచ్చేశాడు. దువ్వాసి మోహన్ తప్ప తెలిసిన మొహం ఇంకెవరు లేరు.

మేకింగ్ వేల్యూస్ తక్కువగా ఉన్నాయి. యూత్ ని టెంప్ట్ చేయడమే పరమావధిగా పెట్టుకుని ముద్దు సీన్లు విచ్చలవిడి శృంగారాన్ని జొప్పించినట్టు ఉంది తప్ప ఏ కోశానా ఇందులో ఆసక్తి రేపే అంశాలు లేవు. బూతులకు లోటు లేకుండా చూసుకున్నారు. జాతీయ అవార్డు సాధించిన సినిమా తీసిన దర్శకుడే ఇది తీశాడా అని అనుమానం కలిగితే అది ముమ్మాటికీ మీ తప్పు కాదు