పాపం నాని.. మంచి సీన్ మిస్సయింది

0

షూటింగులో తీసిన ప్రతి సన్నివేశం సినిమాలో ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఎంతో ఇష్టపడి.. కష్టపడి చేసిన సీన్లు కూడా ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఎగిరిపోతుంటాయి. కొన్నిసార్లు అలాంటి సీన్లు ఎప్పటికీ బయటికి రాకుండా ఉండిపోతాయి. కొన్నిసార్లు రిలీజ్ తర్వాత యూట్యూబ్ లోకి రావడమో.. లేదంటే థియేటర్లలోనే సీన్లు కలపడమో చేస్తుంటారు. ‘భరత్ అనే నేను’ సినిమా నిడివి పెరిగిపోవడంతో సినిమాలోని కొన్ని మంచి సీన్లు కూడా తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత యూట్యూబ్ లోకి వచ్చిన డెలీటెడ్ సీన్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవి సినిమాలో ఉంటే బాగుండే అన్న ఫీలింగ్ జనాలకు కలిగింది. ఇప్పుడు ‘దేవదాస్’ విషయంలోనూ జనాలకు ఇదే ఫీలింగ్ కలుగుతోంది.

నాని చేసిన ఒక మంచి ఎమోషనల్ సన్నివేశాన్ని ఎడిటింగ్ టైంలో సినిమా నుంచి తీసేయాల్సి వచ్చింది. సినిమాలో నాగార్జునతో గొడవ అయ్యాక నాని తిరిగి తాను ఇంతకుముందు పని చేసిన కార్పొరేట్ హాస్పిటల్ కు వచ్చి తనకు ఉద్యోగం ఇవ్వమని రావు రమేష్ ను అడుగుతాడు. అతను అవమానకరంగా మాట్లాడి పంపించేస్తాడు. వెళ్తూ వెళ్తూ ఆవేశం తెచ్చుకున్న నాని.. వెనక్కి వచ్చి అందరి బెండు తీస్తాడు. ఆ సీన్ ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఈ సీన్లో నాని అదరగొట్టేశాడు. సన్నివేశం కూడా చాలా బాగుంది. ఇది సినిమాలో ఉంటే కచ్చితంగా ప్లస్ అయ్యేదే. ‘దేవదాస్’ ఎడిటింగ్ టేబుల్ దగ్గర హడావుడి నెలకొందని.. చివరి నిమిషాల్లో ఎలా పడితే అలా ఎడిట్ చేసి సినిమాను చెడగొట్టారని విమర్శలున్నాయి. ఆ ప్రభావం సినిమాలోనూ కనిపించింది. ఈ సీన్ తీసేయడంపై నాని హర్టయినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సీన్ చూసిన వాళ్లందరూ కూడా ఇది సినిమాలో ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతుండటం గమనార్హం.మరి ఇలాంటి సీన్ ఎలా తీసేశారో?
Please Read Disclaimer