దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతానికి 15 ఏళ్లు

0devi-sri-prasadటాలీవుడ్‌ టాప్‌ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తన సంగీత ప్రస్థానం మొదలు పెట్టి 15 సంవత్సరాలు అయ్యింది. ఈ 15 సంవత్సరాల్లో ఈయన ఎన్నో అద్బుత పాటలను తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకు అందించాడు. టాలీవుడ్‌లోని అందరు ప్రముఖ హీరోల సినిమాలకు సంగీతం అందించిన ఘనత ఒక్క దేవిశ్రీ ప్రసాద్‌కు మాత్రమే దక్కింది అంటే అతిశయోక్తి కాదు. ఈయన తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలువురు స్టార్‌ హీరోల సినిమాలకు సంగీతం అందించాడు. దేవిశ్రీలోని ఉన్న స్పీడ్‌ మెగాస్టార్‌ చిరంజీవికి బాగా నచ్చేది. అందుకే ప్రత్యేకంగా దేవిశ్రీని అభిమానిస్తాడు చిరు.

మార్చి 12, 1999లో ‘దేవి’ చిత్రంతో కెరీర్‌ను ఆరంభించాడు. మొదటి చిత్రం మంచి పేరు తేవడంతో ఆ చిత్ర పేరునే ఇంటిపేరుగా మలచుకుని ఈయన వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. టాలీవుడ్‌లో తొలి కోటి తీసుకున్న తెలుగు మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈయన ట్యూన్స్‌ అందించిన ‘లెజెండ్‌’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఇక పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ఆ మధ్య షూటింగ్‌ ప్రారంభం అయిన ‘గబ్బర్‌సింగ్‌`2’కు కూడా దేవిశ్రీ సంగీతం అందించబోతున్నట్లు ప్రకటించారు. పవన్‌తో ‘జల్సా’, ‘గబ్బర్‌సింగ్‌’, ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించాడు. ఈ మూడు చిత్రాల్లోని పాటలు ఆయా సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించాయి.