అమర్ అక్బర్ ఆంటోని..ఆ డైలాగ్ చేటు చేసిందా?

0

ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు కావడానికి ఎంతో సమయం పట్టదు. సినీ రంగంలో ఇలా పరిస్థితులు తలకిందులు కావడానికి ఎంతో సమయం పట్టదు. అగ్ర దర్శకుడు శ్రీను వైట్ల విషయంలో ఇదే జరిగింది. అతను ‘బాద్ షా’ సినిమా తీసే సమయానికి టాలీవుడ్లో అత్యధిక డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడు. వైట్లతో సినిమా తీయడానికి హీరోలు ఎగబడేవారు. కానీ ఆ సినిమా తర్వాత మూడే మూడు సినిమాలతో పాతాళానికి పడిపోయాడతను. ‘ఆగడు’.. ‘బ్రూస్ లీ’.. ‘మిస్టర్’ సినిమాలు వైట్ల ఇమేజ్ ను మామూలుగా డ్యామేజ్ చేయలేదు. ‘బ్రూస్ లీ’ టైంకే ఇక వైట్లకు ఇంకో సినిమా రావడం కష్టమన్నట్లు తయారైంది పరిస్థితి. వైట్ల సినిమాలన్నీ ఒకే ఫార్మాట్ లో సాగుతూ మొహం మొత్తేలా తయారు కావడమే అతడి పతనానికి కారణం. ఇలాంటి టైంలో ‘మిస్టర్’ తీసిన అతను ఏమైనా కొత్తదనం చూపిస్తాడేమో అనుకున్నారంతా. కానీ మళ్లీ రొటీన్ బాటలోనే సాగి ప్రేక్షకుల ఆగ్రహానికి గురయ్యాడు.

దీని తర్వాత అతడికి ఇంకో సినిమా రావడం.. వచ్చినా పెద్ద హీరో.. పెద్ద నిర్మాత ఛాన్సివ్వడం అసాధ్యం అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ‘మైత్రీ మూవీ మేకర్స్’ లాంటి బడా సంస్థలో రవితేజ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ చిత్రమే.. అమర్ అక్బర్ ఆంటోనీ. దీని ప్రమోషన్లు కొంచెం వెరైటీగా ఉండటంతో ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడనుకున్నారు. కానీ దీని టీజర్ చూస్తే వైట్ల నుంచి మార్పేమీ ఆశించలేమనిపించింది. ఈ టీజర్ లో కొత్తగా ఏమీ కనిపించలేదు. పైగా ఇందులోని ఒక డైలాగ్ ప్రేక్షకులు పెదవి విరిచేలా చేసింది. ‘‘వాడు ఎక్కడుంటాడో తెలియదు.. ఎలా ఉంటాడో తెలియదు’’ అంటూ హీరో గురించి విలన్ అంటాడు. ఈ డైలాగ్ తెలుగు సినిమాల్లో విని విని విసుగెత్తిపోయి ఉన్నారు జనాలు. కమర్షియల్ సినిమాల్లో ఎప్పుడూ వినిపించే డైలాగ్ ఇది. ఈ డైలాగ్ తో హీరో క్యారెక్టరైజేషన్ మీద.. సినిమా మీద జనాలకు ఒక అంచనా వచ్చేసింది. వైట్ల మళ్లీ ఏదో రొటీన్ సినిమా తీశాడేమో అన్న అభిప్రాయానికి వచ్చేశారు. ‘అమర్ అక్బర్ ఆంటొని’కి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోవడానికి కూడా ఈ ఫీలింగే కారణం. మరి వైట్ల టీజర్ కు భిన్నంగా సినిమాలో ఏమైనా కొత్తదనం చూపించి జనాల ఫీలింగ్ మారుస్తాడేమో చూడాలి.
Please Read Disclaimer