బాలయ్య – క్రిష్.. ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా..?

0nbk-plus-krish-mainతెలుగు సినీ ప్రపంచంలో నటసింహంగా పేరుగాంచిన నందమూరి బాలకృష్ణ తన ప్రతిష్టాత్మక వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తో బాక్సాఫీస్ దగ్గర గర్జించడానికి వస్తోన్న విషయం తెలిసిందే. ఈ చారిత్రక చిత్రాన్ని విలక్షణ దర్శకుడు క్రిష్ అద్భుతంగా తెరకెక్కించడంతో.. ఇప్పటికే సినీ లవర్స్ నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు అందరూ ఫిదా అయిపోయారు. అలాగే ఈ విజువల్ వండర్ ను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ లోకమంతా బాలయ్య శాతకర్ణి కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటే.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ క్రేజీ సినిమాను బాలీవుడ్ లో మార్కెట్ చేసుకోవడంలో మాత్రం బాలయ్య, క్రిష్ లు ఫెయిల్ అయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
ఆ విషయంలోకి వెళితే, శాతకర్ణి మేకర్స్ ఈ అద్భుతమైన చిత్రాన్ని హిందీ వరకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారంటే.. కొంతలో కొంత నిజమని ఒప్పుకోవాల్సిందే. ముఖ్యంగా అక్షయ్ కుమార్ తో ‘ఠాగూర్’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి పేరు తెచ్చుకున్న క్రిష్.. ఇప్పుడు తన ఈ భారీ చిత్రాన్ని మాత్రం హిందీలో మార్కెట్ చేసుకోకపోవడం సినీ వర్గాలకు కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. ఇప్పటికే ‘బాహుబలి’ తో రాజమౌళి హిందీలో కూడా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాడో చూశాం. మరి రాజమౌళితో సమానంగా.. ఆ మాటకొస్తే డైరెక్ట్ హిందీ సినిమాతో డైరెక్టర్ గా రాజమౌళికి మించిన గుర్తింపు తెచ్చుకున్న క్రిష్.. ఈ విషయంలో మాత్రం వెనుకబడటం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు. అందులోనూ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లో డ్రీమ్ గర్ల్, బాలీవుడ్ నటి హేమమాలిని, లెజెండరీ యాక్టర్ కబీర్ బేడీ, బాలీవుడ్ సినీ లవర్స్ కు పరిచయమున్న శ్రియ శరన్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా.. సినిమాను హిందీలో భారీగా ప్రమోట్ చేయకపోవడం వెనుక కారణాలు ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయంపై రకరకాల స్టోరీలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కి బాలీవుడ్ లో థియేటర్ల సమస్య ఎదురైందని, రాజమౌళికి కూడా ఎదురుకాని ఈ సమస్య క్రిష్ కి ఎదురవడంతోనే శాతకర్ణిని బాలీవుడ్ కి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా శాతకర్ణి మూవీని కేవలం 79 రోజుల్లోనే ముగించాలన్న గట్టి పట్టుదలతో మనవాళ్ళు తొందరగా ఫినిష్ చేయడం కూడా దీనికి ఓ కారణం అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఇప్పటివరకు గౌతమిపుత్ర శాతకర్ణి హిందీ డబ్బింగ్ వెర్షన్ అనే న్యూసే బయటకు రాలేదంటే.. అసలు మనవాళ్ళకు శాతకర్ణిని ఇప్పుడు హిందీలోకి తీసుకెళ్లే ఉద్దేశ్యమే లేదని అర్థమవుతుంది. కానీ, తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు ఈ విషయంలోకి ఊహించని ట్విస్ట్ తీసుకొచ్చింది. అదేంటంటే.. తాజాగా ముంబైలో డైరెక్టర్ క్రిష్ స్పెషల్ షో వేయిస్తే, ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ శాతకర్ణి చిత్రాన్ని చూసి వెంటనే జాతీయ, అంతర్జాతీయ హక్కులు కొనేందుకు ముందుకు వచ్చేసిందని, దాంతో క్రిష్ నాలుగు కంపెనీలకు సంతకాలు కూడా చేశాడని వర్మ చెప్పుకొచ్చాడు. అంటే, ఇప్పటికిప్పుడు బాలయ్య శాతకర్ణి నేషనల్ వైడ్ గా రిలీజ్ కాకపోయినా.. త్వరలోనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అర్థమవుతుంది. క్రిష్ దీనివెనుక భారీ ప్రణాళికలే రచించాడని తెలుస్తోంది. మరి ఇదే నిజమైతే, తెలుగువాడి కీర్తి దశదిశలా వ్యాపించినట్లే.