మహర్షి నిర్మాతలు.. ఎవరి వాదన వారిది!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25 వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ మే 9 న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ తక్కువేమీ కాదు. దాదాపు మహేష్ నటించే అన్ని సినిమాల తరహాలోనే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. థియేట్రికల్.. శాటిలైట్.. హిందీ డబ్బింగ్ రైట్స్.. ఇతర హక్కులు కలిపి రూ. 130 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందనే టాక్ ఉంది. అయితే సినిమా రిలీజ్ ముంగిట నిర్మాతల మధ్యలో విభేదాలు తలెత్తాయని అంటున్నారు.

ఈ సినిమాకు దిల్ రాజు.. అశ్విని దత్.. ప్రసాద్ వీ పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరించారు. మహేష్ బాబుకు అశ్విని దత్ చాలా రోజుల క్రితమే ఎడ్వాన్స్ ఇచ్చారు. దీంతో మహేష్ బాబుకు ఆయనతో సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఉంది. మరోవైపు మహర్షి సినిమా నిజానికి ‘బ్రహ్మోత్సవం’ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో..పీవీపీ నిర్మాణంలోనే సినిమా తెరకెక్కాల్సి ఉంది. కానీ వంశీ పైడిపల్లి పీవీపీని కాదని దిల్ రాజు బ్యానర్లో చేసేందుకు రెడీ కావడంతో పీవీపీ కోర్టుకు వెళ్ళడం.. ఫైనల్ గా మహేష్ రాజీ కుదిర్చి.. అయనను కూడా నిర్మాణ భాగస్వామిగా చేర్చుకోవడం తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ ఒకేసారి మూడు వేరే వేరే కమిట్ మెంట్స్ ను పూర్తి చేయవచ్చు అన్నట్టుగా ప్లాన్ చేశాడు మహేష్. నిజానికి మహేష్ ఇలా ముగ్గురిని కలపడంతోనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయనే ఒక అభిప్రాయం వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే..ఇప్పుడు ‘మహర్షి’ సినిమాకు ముందు అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ అయింది. నిజంగా అయిందో లేదో కానీ చాలా రోజుల నుండి బడ్జెట్ దాటిపోయిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. భారీగా ప్రీ -రిలీజ్ బిజినెస్ జరిగినా నిర్మాతలకు మిగిలేది ఏమీ ఉండదని జోరుగా ప్రచారం సాగుతోంది. అసలే ముగ్గురు నిర్మాతలు.. పైగా బలవంతంగా చేస్తున్న కాపురం లాంటిది. కాబట్టి మిగతా విషయాలు ఎలా ఉన్నా లాభాల విషయం వచ్చేసరికి ఎవరివాటా వారికి రావాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న టాక్ ఏంటంటే సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినా తనకు చిల్లిగవ్వ కూడా మిగలలేదని రాజుగారు అంటున్నారట. సినిమాపై పెట్టిన పెట్టుబడికి అది సరిపోయింది… ఇది లాభాలులేని వెంచర్ అని అంటున్నారట. ఈ వివాదంలో దిల్ రాజు – పీవీపీల వాదన ఒకేవిధంగా ఉందట.

కానీ దత్తుగారు మాత్రం ఈ సినిమా నుండి కనీసం తన వాటాగా రూ. 10 కోట్ల లాభం ఆశిస్తున్నారట. ఒక్కరూపాయ లాభం కూడా లేకుండా సూపర్ స్టార్ తో సినిమా చేయడం ఎందుకు? ఈ సినిమాతో మా బ్యానర్ అసోసియేట్ కావడం ఎందుకని అంటున్నారట. ఊరికే వైజయంతి పేరు పోస్టర్ల మీద ఉండి ఏం లాభం అనేది ఆయన వెర్షన్. రాజుగారి లాజిక్ ఒకటైతే దత్తుగారి లాజిక్ ఇంకోటి. మరి ఈ విషయంలో మహేష్ బాబు చొరవ తీసుకొని ఇద్దరూ సీనియర్ల మధ్య సయోధ్య కుదురుస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

ఏదేమైనా ఒకటి మాత్రం నిజం. ఇలాంటి వివాదాలు సినిమాపై నెగెటివిటీ పెంచే అవకాశం ఉంది. కంగనా రనౌత్ సినిమాలకు.. రామ్ గోపాల్ వర్మ సినిమాలకు నెగెటివిటీ వల్ల లాభం చేకూరుతుందేమో కానీ మహేష్ లాంటి అన్ని సెక్షన్ల ఆడియన్స్ లో ఆదరణ ఉన్న సూపర్ స్టార్ కు కాదు. అటు నిర్మాతలైనా.. ఇటు మహేష్ బాబు అయినా వీటిపై క్లారిటీ ఇచ్చి ఈ ప్రచారాలకు అడ్డుకట్ట వేయడం మంచిది.




Please Read Disclaimer