దిల్ రాజు.. ది బాలీవుడ్ ప్రొడ్యూసర్

0టాలీవుడ్ నవతరం ప్రొడ్యూసర్లలో దిల్ రాజును మించిన వాళ్లు లేరు. నిర్మాణ విలువలు.. క్రెడిబిలిటీ.. జడ్జిమెంట్ స్కిల్స్.. సక్సెస్ రేట్.. ఇలా ఏ విషయంలో చూసినా దిల్ రాజు స్థాయి ఏంటో తెలుస్తుంది. టాలీవుడ్లో చాలామంది అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించాడు రాజు. గత ఏడాది ఏకంగా అరడజను సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కూడా అరడజను దాకా సినిమాలు లైన్లో పెట్టాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్.. లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో ‘భారతీయుడు-2’ లాంటి భారీ చిత్రం తీయాలని కూడా రాజు ప్లాన్ చేశాడు కానీ.. అది అనివార్య కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. అంతమాత్రాన రాజు టాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయిపోతాడని అనుకోవడానికి లేదు. ఆయన ఇప్పుడు బాలీవుడ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజే స్వయంగా ధ్రువీకరించాడు.

ఒక ఇంగ్లిష్ డైలీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బాలీవుడ్ సినిమాలు నిర్మించే యోచనలో ఉన్నట్లు రాజు వెల్లడించాడు. అక్కడ తన తొలి ప్రాజెక్టు 2020లో మొదలవుతుందని కూడా చెప్పాడు రాజు. ఏదో ఒక సినిమా అని కాకుండా వరుసగా హిందీ సినిమాలు నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు రాజు తెలిపాడు. గతంలో మన హీరోలు.. దర్శకులు.. నిర్మాతలు హిందీలో తరచుగా సినిమాలు చేసేవాళ్లు. కానీ గత రెండు దశాబ్దాల్లో అక్కడ మనోళ్ల సినిమాలు బాగా తగ్గిపోయాయి. ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రమే అక్కడ తన ఉనికిని చాటుకున్నాడు. నిర్మాతలైతే దాదాపుగా బాలీవుడ్ వైపు చూడటం మానేశారు. మరి రాజు మాటల్ని బట్టి చూస్తుంటే ఆయనకు బాలీవుడ్ సినిమాల విషయంలో భారీ ప్రణాళికలే ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ ఉద్దేశంతోనే తన అన్న కొడుకు హర్షిత్ ను నిర్మాతగా మౌల్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అతడికి తెలుగు సినిమాల బాధ్యతలు అప్పగించి రాజు బాలీవుడ్ కు వెళ్లిపోతాడేమో. మరి ఇక్కడి మాదిరే రాజు.. హిందీలోనూ నిర్మాతగా తనదైన ముద్ర వేస్తాడేమో చూడాలి.