దిల్ రాజుకి లవర్ గండం

0నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా రెండు గుర్రాలను ఒకేసారి నడుపుతున్న దిల్ రాజు మంచి బిజినెస్ మెన్. నిర్మాతగా ఖచ్చితమైన లెక్కతో సబ్జెక్టు వర్క్ అవుట్ అవుతుందా లేదా గుర్తించి మరీ సెట్స్ పైకి తీసుకెళ్లడంలో నేర్పరి. ఒకవేళ అంచనా తప్పి అవుట్ ఫుట్ కాస్త తేడాగా వచ్చినప్పుడు ప్రమోషన్స్ తో దాన్ని ఎలివేట్ చేసుకుని నష్టం లేకుండా చేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. కానీ ఒక్క సినిమా మాత్రం దిల్ రాజుకు సవాల్ విసురుతున్నట్టు కనిపిస్తోంది. అదే లవర్. రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీకి దర్శకుడు అనీష్ కృష్ణ. గతంలో అలా ఇలా అనే సినిమా ఒకటి తీసాడు. కమర్షియల్ గా మరీ గొప్పగా ఆడకపోయినా ఎంటర్ టైన్మెంట్ బాగానే ఉండటంతో అతనికి మంచి ప్రశంశలు దక్కాయి. అది వచ్చి చాలా ఏళ్లయింది. మళ్ళి ఇప్పుడు లవర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవలే రాజ్ తరుణ్ పిలకతో హీరోయిన్ రిద్ది కుమార్ ను ఎత్తుకున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఏమంత కిక్ ఇవ్వలేదు సరికదా ఏముందబ్బా ఇందులో అనే కామెంట్స్ వచ్చేలా చేసింది. మోషన్ పోస్టర్ ది కూడా ఇదే పరిస్థితి.

నిజానికి దీనికి కారణం రాజ్ తరుణ్ మార్కెట్ అని చెప్పాలి. గత రెండేళ్లుగా గట్టిగా చెప్పుకునే హిట్టు ఒక్కటి కూడా లేదు. పైగా ఈ ఏడాది ఆరు నెలలు పూర్తి కాకుండానే వచ్చిన రెండు సినిమాలు రంగుల రాట్నం-రాజుగాడు కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేని దారుణంగా పరాజయం పాలు కావడం కుర్రాడి ఇమేజ్ ని బాగా దెబ్బ తీసింది. అందుకే దిల్ రాజు ఎంత ప్రయత్నిస్తున్నా లవర్ ని లిఫ్ట్ చేయలేకపోతున్నట్టు వినికిడి. తన పేరు మీద సినిమాను విడుదల చేయగలరు కానీ సక్సెస్ ఆయన చేతిలో ఉండదుగా. పైగా బజ్ చూస్తుంటే రాజ్ తరుణ్ ని దిల్ రాజు సైతం లేపేలా లేరే అనే కామెంట్స్ ఊపందుకున్నాయి. దర్శకుడికి ఒక్క సినిమా అనుభవం ఉండటం అది కూడా ఎవరికి పెద్దగా తెలియని సినిమా కావడం ఇవన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. జులై మొదటి వారమే విడుదల అనుకున్నప్పటికీ పొజిషన్ చూసుకుని డిసైడ్ చేయాలనీ దిల్ రాజు అనుకుంటున్నట్టు తెలిసింది. పరిస్థితి చూస్తుంటే లవర్ కు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఛాలెంజ్ ఎదురయ్యేలా ఉంది.