ఎన్టీఆర్ – చ‌ర‌ణ్‌… మ‌ధ్యలో దిల్ రాజు!!

0ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాలు తీస్తార‌ని దిల్‌రాజుకి భ‌లే మంచి పేరుంది. ఏ సినిమా ఎప్పుడు ఎవ‌రితో తీయాలి? ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే విష‌యాలు ఆయ‌న‌కు తెలిసినంత‌గా మ‌రే ఇత‌ర ‘యువ‌’ నిర్మాత‌కూ తెలీవేమో. అందుకే అన‌తి కాలంలోనే స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా ఎదిగారు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లతో సినిమాలు తీసి – ప‌రిశ్రమ‌లో త‌న‌కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు. ఎవ‌డు, రామయ్యా వ‌స్తావ‌య్యా సినిమాల‌ను ఆయ‌నే నిర్మాత‌. ఇద్దరు స్టార్ హీరోల‌తో ఏక కాలంలో సినిమా తీయ‌డం ఆయ‌న గ‌ట్స్‌కు నిద‌ర్శనం. వాటి వెనుకా బ‌ల‌మైన ప్లానింగ్ ఉంది. జులైలో ఎవ‌డు, సెప్టెంబ‌రులో రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమాలు రిలీజ్ చేయాల‌న్నది ఆయ‌న ఆలోచ‌న‌. ఒక్కో సినిమాకి క‌నీసం రూ. 50 కోట్ల బ‌డ్జెట్ వేసుకొన్నా – ఈ రెండు సినిమాల‌పై ఆయ‌న దాదాపు రూ.100 కోట్లు పెట్టుబ‌డి పెట్టారు. అయితే తొలిసారి ఆయన ప్లాన్ ఘోరంగా విఫ‌ల‌మైంది. దాంతో ఈ వంద‌కోట్లూ రిస్క్‌లో ప‌డ్డాయి.

dilraju-release-troubles

రాష్ట్ర్రంలో చెల‌రేగుతున్న రాజ‌కీయ అశాంతి – దిల్ రాజు సినిమాల‌కు ఎస‌ర పెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప‌రిస్థితులు బాగోలేవు కాబట్టే – ఎవ‌డు సినిమా పూర్తయినా ఆయ‌న బ‌య‌ట‌కు తీసుకురాలేక‌పోతున్నారు. ఆగ‌స్టు 21న ఈ సినిమా రాక‌పోతే – సెప్టెంబ‌రు చివ‌రి వారంలోనే విడుద‌ల చేయాలి. ఎందుకంటే తుఫాన్ సెప్టెంబ‌రు 6న ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విడుద‌ల కావ‌డానికి సిద్ధంగా ఉంది. రెండు సినిమాల మ‌ధ్య క‌నీసం ప‌దిహేను రోజుల వ్యవ‌ధి ఉండేలా చూసుకోవ‌డం చాలా ముఖ్యం. అందుకే తుఫాన్ విడుద‌ల అయిన త‌ర‌వాతే.. ఎవ‌డు వ‌చ్చే ఛాన్స్ ఉంది. అయితే సెప్టెంబ‌రులో రామ‌య్యా వ‌స్తావ‌య్యా విడుద‌ల కావ‌డానికి సిద్ధంగా ఉంది. నిజానికి ఈ సినిమా ఆగ‌స్టులో విడుద‌ల కావ‌ల్సి వుంది. అయితే ఎవడు, అత్తారింటికి దారేది సినిమాల్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ చిత్రాన్ని సెప్టెంబ‌రులో విడుద‌ల‌చేసేలా ప్రణాళిక వేసుకొన్నారు. ఇప్పుడు ఎవ‌డు కూడ సెప్టెంబ‌రులోనే తీసుకొస్తే – ఎన్టీఆర్ సినిమాకు ఇబ్బంది. “ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నా సినిమా అనుకొన్న తేదీకి వ‌చ్చి తీరాల్సిందే..“ అని ఎన్టీఆర్ అల్టీమెటం జారీ చేశాడ‌ట‌. దాంతో దిల్ రాజు ప‌రిస్థితి అడ‌కత్తెర‌లో పోక‌చెక్కలా త‌యారైంది. అటు చ‌ర‌ణ్ సినిమాని ఆప‌లేడు, ఇటు ఎన్టీఆర్‌కి ఎదురు చెప్పలేడు. దాంతో ఈ వంద కోట్లు రిస్క్‌లో ప‌డే ప్రమాదం వ‌చ్చి ప‌డింది. ఈ రెండు సినిమాల్ని కొన్న బ‌య్యర్లు మ‌రోవిధంగా దిల్ రాజుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఈ రెండు సినిమాల మ‌ధ్య వ్యవ‌ధి లేక‌పోతే – మాకు చాలా న‌ష్టాలొస్తాయ్… అని బ‌య్యర్లు గగ్గోలు పెడుతున్నారు. ఎవ‌రికి ఎలా స‌ర్ది చెప్పాలో అర్థం కాక‌… దిల్ ధ‌డేల్ మంటోంది దిల్ రాజుకి. నిజంగా ఆయ‌న‌కు ఇది క్లిష్ట ప‌రిస్థితే. ఇందులోంచి ఎలా బ‌య‌ట ప‌డ‌తాడో, ఏ సినిమాని ముందు విడుద‌ల చేస్తాడో, ఎవ‌రి కోసం ఎవ‌రిని వ‌దులుకొంటాడో చూడాలి.