అర్జున్ ఉన్నాడు.. విశాల్ లేడు

0

ఈ ఏడాది తమిళ-తెలుగు భాషల్లో సెన్సేషనల్ హిట్టయిన సినిమా ‘ఇరుంబు తిరై/అభిమన్యుడు’. కొత్త దర్శకుడు పి.ఎస్.మిత్రన్ రూపొందించిన ఈ చిత్రంలో విశాల్ హీరోగా నటించాడు. సమంత అతడితో జోడీ కట్టింది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు అర్జున్ విలన్ పాత్రలో నటించడం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి కలిగించింది. విశాల్-అర్జున్ ల పోరే సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అర్జున్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడిందులో. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే అందరి ప్రశంసలు అందుకున్నాడు మిత్రన్. మొబైల్స్.. టెక్నాలజీ విషయంలో ప్రపంచం ఎంతలా మారిపోయిందో.. వాటి దుష్పరిణామాలేంటో ఈ సినిమాలో చాలా బాగా చర్చించాడు మిత్రన్. ఎంటర్ టైన్ మెంట్ పూతతోనే ఎన్నో ఆలోచింపజేసే విషయాలూ చెప్పాడతను.

తొలి సినిమాతో అంతగా ఆకట్టుకున్న మిత్రన్.. తన రెండో సినిమాకు కమిటయ్యాడు. అతను తన తొలి సినిమా కాంబినేషన్ ను రిపీట్ చేయబోతున్నాడు. అలా అని విశాల్ తోనే ఈ సినిమా కూడా చేస్తున్నాడని అనుకోవద్దు. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నాడట. మరి ఈసారి కూడా అర్జున్ నెగెటివ్ రోలే చేస్తున్నాడా.. లేక వేరే క్యారెక్టరా అన్నది తెలియదు. మిత్రన్ టాలెంట్ ప్రకారం అది ఏ తరహా క్యారెక్టర్ అయినా ప్రత్యేకంగానే ఉంటుందని ఆశిస్తున్నారు. చిన్న చిన్న క్యారెక్టర్లతో మొదలుపెట్టి పెద్ద హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్.. చివరగా ‘సీమ రాజా’తో ఎదురు దెబ్బ తిన్నాడు. మిత్రన్ తో చేయబోయే సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కుతాడని ఆశిస్తున్నారు. ఇది హీరోగా అతడికి 15వ సినిమా అట. దీన్ని తెలుగులోకి కూడా అనువాదం చేయనున్నారట.
Please Read Disclaimer