మిల్కీ వర్సెస్ నీలకంఠ.. ఇంకానా?

0మిల్కీ బ్యూటీ తమన్నా జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠతో గొడవపెట్టుకోవడం.. ఆ కారణంగా క్వీన్ రీమేక్ ఆర్నెళ్లు ఆలస్యంగా ప్రారంభం అవ్వడం తెలిసిందే. ఆ క్రమంలోనే ఈ విషయంపై తమన్నా మాట్లాడుతూ ఇవన్నీ రూమర్లు అంటూ కొట్టి పారేసింది. తాను ఏ దర్శకుడితోనూ గొడవ పడలేదని అంది. అయితే తొలుత తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహిస్తారనుకున్న నీలకంఠ ప్రాజెక్టు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.

తాజాగా క్వీన్ తెలుగు రీమేక్ `దటీజ్ మహాలక్ష్మి` గుమ్మడి కాయ కార్యక్రమం వేళ పంపిన ప్రెస్ నోట్ లో దర్శకుడి పేరు లేకపోవడం సంచలనమైంది. అత్యంత కీలకమైన ప్రెస్ నోట్ లో దర్శకుడి పేరు వేయకపోవడానికి కారణమేంటి? అన్న చర్చ సాగుతోంది. వివాదం వల్లనే ఇలా చేశారా? అంటూ మాట్లాడుకున్నారు. మిల్కీ `దట్ ఈజ్ మహాలక్ష్మి`కి `అ!` ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ప్రెస్ నోట్ లో అతడి పేరు మాత్రం వేయకపోవడం ఆశ్చర్యపరిచింది. అదంతా అటుంచితే క్వీన్ తెలుగు రీమేక్ కి నీలకంఠ దర్శకత్వం వహించకపోయినా – మలయాళ రీమేక్ కి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. క్వీన్ తెలుగు – తమిళ్ – మలయాళ వెర్షన్లను మనుకుమరన్ నిర్మిస్తున్నారు. తమిళంలో కాజల్ – మలయాళంలో మాంజిమ – కన్నడలో పారుల్ యాదవ్ క్వీన్ పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.