మహేష్‌తో సినిమా చేయమని ఆయన్నడిగితే…

0Director-Vikramanవిక్రమన్.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులు మరిచిపోయి ఉండొచ్చు. ఒకప్పుడు విక్టరీ వెంకటేష్‌తో ‘వసంతం’.. వేణుతో ‘చెప్పవే చిరుగాలి’ సినిమాలు చేసిన తమిళ దర్శకుడితను. తమిళంలో 90ల్లో విక్రమన్ నెంబర్ వన్ డైరెక్టర్. అతడి సినిమాలు అప్పట్లో భారీ విజయాలు సాధించాయి. శుభాకాంక్షలు.. సూర్య వంశం.. మా అన్నయ్య.. ఇంకా చాలా సినిమాల తమిళ వెర్షన్లకు అతనే దర్శకుడు. అప్పట్లో అవి సెన్సేషనల్ హిట్టయ్యాయి. విక్రమన్ దర్శకత్వంలో ఒక్కసారి నటిస్తే చాలని అప్పటి తమిళ స్టార్లు తహతహలాడేవారు.

ఆ దర్శకుడిని మహేష్ అక్క మంజుల ఒక టైంలో తన తమ్ముడితో సినిమా చేయమని అడిగిందట. ఆయన వరుస హిట్ల మీద ఉన్నపుడు.. మహేష్ అప్పుడే హీరోగా తొలి అడుగులు వేస్తున్నపుడు తన తమ్ముడితో సినిమా చేయమని అడిగిందట మంజుల. కానీ ఆయన అప్పుడు ఒప్పుకోలేదట. తనకు తెలుగు తెలియదని.. భాష తెలియని చోట సినిమాలు చేయలేనని విక్రమన్ తిరస్కరించాడట.

ఐతే అప్పుడు మహేష్‌తో సినిమా చేయనందుకు ఇప్పుడు చింతిస్తున్నానని ‘స్పైడర్’ ఆడియో వేడుకకు అతిథిగా వచ్చిన విక్రమన్ అన్నాడు. ఐతే మురుగదాస్ ఇప్పుడు మహేష్‌తో ‘స్పైడర్’ చేయడం.. ఆ సినిమా తమిళంలో కూడా రిలీజవుతుండటం ఆనందంగా ఉందని అన్నాడు విక్రమన్.

ఐతే భాష రాదని మహేష్‌తో సినిమా చేయనన్న ఆ తర్వాత ‘వసంతం’.. ‘చెప్పవే చిరుగాలి’ సినిమాలు ఎలా చేశారో? నిజానికి ఆ రెండు సినిమాలు చేసే సమయానికి తమిళంలో ఆయన జోరు తగ్గిపోయింది. అప్పుడు మాత్రం భాష అడ్డు రాలేదన్నమాట. ఈ రెండు సినిమాలకు డైలాగ్స్ క్రెడిట్ కూడా విక్రమనే తీసుకున్నాడు. ఆయన తమిళంలో డైలాగులు రాస్తే.. వాటిని అసిస్టెంట్లు తెలుగులోకి అనువదించి రాసేవాళ్లన్నమాట.