దర్శకుడి మాట హీరోయిన్ కి దెబ్బలు

0పిప్పి పన్ను తీయబోతే ఉన్న పన్ను ఊడిందనే సామెత ఊరికే రాలేదు. ఎవరో ఒకరి అనుభవం నుంచే దాన్ని పుట్టించి ఉంటారు. హీరోయిన్ దిశా పటానికి ఇది స్వయంగా తెలిసివచ్చింది. ఎలాగంటారా. సల్మాన్ ఖాన్ హీరోగా అబ్బాస్ అలీ దర్శకత్వంలో భరత్ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్ గా చేస్తోంది. ఒక రిస్కీ షాట్ కోసం నిజంగానే ఫైట్ చేయాల్సి వచ్చింది దిశా. వ్యక్తిగతంగా తను గతంలోనే అందులో శిక్షణ తీసుకుంది. భాగీ 2 కోసం టైగర్ ష్రాఫ్ తో కలిసి ట్రైనింగ్ హాజరయ్యింది. ఆ ధైర్యంతోనే బాడీ డబుల్ లేకుండా తన మీదే చిత్రీకరించేందుకు సిద్ధమయ్యాడు దర్శకుడు అబ్బాస్. చిన్న హీరో సినిమాకే అంత కష్టపడిన దిశ సల్మాన్ లాంటి స్టార్ తో అంటే ఊరికే ఉంటుందా. ఓ రెండు వారాలు ఆ యాక్షన్ సీన్స్ కోసమే కఠినమైన ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఎక్కడో శృతి తప్పి కింద పడి మోకాలి చిప్పలు విరగొట్టుకుంది. దర్శకుడు పర్ఫెక్ట్ గా రావాలని పదే పదే చెప్పడంతో దిశా ఆయన మాట కోసం తన శక్తికి మించి ప్రాక్టీస్ చేయటం వల్లే ఇలా జరిగిందని ఫ్రెండ్స్ అంటున్నారు.

దెబ్బకు భరత్ షూటింగ్ కొద్దిరోజులు వాయిదా వేయక తప్పడం లేదు. వచ్చే షెడ్యూల్ లో ఉన్నవన్నీ తనతో కాంబినేషన్ సీన్లు కావడంతో వేరే ఆప్షన్ లేక అబ్బాస్ అబ్బా అనుకుంటూ పోస్ట్ పోన్ చేసేసాడు. తనవల్ల షూటింగ్ ఆగిపోవడంతో దిశా పటాని బాధ రెండురకాలుగా రెట్టింపు అయ్యింది. అయినా ఏం చేయలేని నిస్సహాయత. సహజత్వం పేరుతో శారీరక సామర్ధ్యానికి మించి రిస్కులు చేస్తే ఇదుగో ఇలాగే దెబ్బలు తినాల్సి ఉంటుంది. నిజానికి ఈ పాత్ర తొలుత కత్రినా కైఫ్ కోసం అనుకున్నారు. కానీ యేవో కారణాల వల్ల నో చెప్పింది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఇది కాస్తా దిశాకు వచ్చి చేరింది. మరో మెయిన్ హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా దీని ద్వారానే బాలీవుడ్ కం బ్యాక్ చేస్తోంది. వచ్చే ఏడాది విడుదల ప్లాన్ చేస్తున్నారు. రేస్ 3 డిజాస్టర్ అయినా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం సల్మాన్ ఖాన్ స్టామినా. అందుకే భరత్ మీద ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.