ట్రైలర్ టాక్: బాగా వాయించే డిజె

0‘పబ్బుల్లో మ్యూజిక్ వాయించే డిజె కాదు.. పగిలిపోయేలా వాయించే డిజె’ అని చెబుతూ.. ‘జూన్ 23న’ వస్తున్నాను అని కూడా చెప్పేశాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. హరీశ్ శంకర్ డైరక్షన్లో రూపొందిన ”డిజె దువ్వాడ జగన్నాథమ్” సినిమా ట్రైలర్ ఈరోజు లాంచ్ చేశారు. పదండి అసలు ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

సత్యానారాయణపురం అగ్రహారంలో నివసించే ఒక బ్రాహ్మణ క్యాటరింగ్ సర్వీస్ ఓనర్ దువ్వాడ జగన్నాథమ్. అక్కడే ఒక మోడ్రన్ అమ్మాయితో ప్రేమలో కూడా పడతాడు. ఇకపోతే ఇంతలో ఎక్కడో ఏదో అలజడి ఒక అవినీతి ఒక విలన్. అతనే రావు రమేష్. అయితే వీళ్లను అంతం చేయడానికి ఈ స్వచ్ఛమైన బ్రాహ్మణుడు విశ్వామిత్రుడి స్టయిల్లో ఆయుధం చేతపట్టి యుద్దానికి బయలుదేరతాడు. ‘బుద్దం శరణం గచ్చామి’ కాదు ఈ కాలానికి కావాల్సింది ‘యుద్దం శరణం గచ్చామి’ అంటూ క్లాసు పీకేసి తన పని తాను చేసుకుపోతుంటాడు డిజె. అల్లు అర్జున్ బ్రాహ్మణ్ గెటప్ లో బాగున్నాడు కాని.. ఆ ఉచ్చారణ కోసం కాస్త కష్టపడ్డాడనే చెప్పాలి. పూజా హెగ్డే గ్లామర్ ఆరబోసిందిలే. రావు రమేష్ పవర్ ఫుల్ గా ఉన్నాడు. అయానక బోస్ విజువల్స్ అదిరిపోయాయ్. దేవిశ్రీ మ్యూజిక్ కూడా బాగానే ఉంది.

ఈ మధ్య కాలంలో రేసుగుర్రం.. సన్నాఫ్ సత్యమూర్తి.. సరైనోడు వంటి సినిమాల్లో రొటీన్ క్యారక్టర్లనే పవర్ ఫుల్ గా చేసుకుపోతున్న అల్లు అర్జున్.. ఇప్పడు కూడా అదే ఫీట్ చేశాడు. హరీశ్ శంకర్ తన పెన్నులోని పవర్ చూపించాడు. ట్రైలర్ బాగానే ఉంది.. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.