ట్రంప్..కిమ్ సమావేశంలో ఏం జరిగింది?

0అనుకున్న సమయం రానే వచ్చేసింది. తమదైన తీరుతో ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తి ఉన్న రెండు భిన్న దేశాలకు చెందిన అధినేత మధ్య సమావేశం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ల మధ్య భేటీ జరిగింది. సింగపూర్ లోని సెంటోసా దీవి దీనికి వేదికగా మారింది. ఈ చారిత్రాత్మక భేటీలో తొలిసారి కలిసిన ట్రంప్.. కిమ్ లు ఉత్సాహంగా ఉండటమే కాదు.. అద్భుతమైన ఫలితాల దిశగా తమ సమావేశం పూర్తి కానుందన్న సానుకూల వ్యాఖ్యల్ని చే్స్తుండటం గమనార్హం.

మంగళవారం జరిగిన ట్రంప్..కిమ్ ల మీటింగ్ లలో తొలుత ట్రంప్.. కిమ్ లు అనువాదకుల సాయంతో భేటీ అయ్యారు. మొదట ఇరువురు దేశాధినేతలు స్నేహపూర్వకంగా కరచాలనం చేశారు. నవ్వుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చారు. తొలుత ఇరువురు అధినేతలు కాస్తంత జాగ్రత్తగా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించారు. అప్రమత్తంగా ఉండటంతో పాటు.. కూసింత ముభావంగా ఉన్న వీరిద్దరు కాసేపటికే వారిద్దరి బాడీలాంగ్వేజ్ లు మారిపోయాయి. ఏకాంత ముఖాముఖి చర్చలు జరిగిన తర్వాత తమ దౌత్యాధికారులతో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వీరిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాల భేటీ సాగింది.

భేటీకి ముందు ట్రంప్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. మిమ్మల్ని కలవటం ఆనందంగా ఉందని కిమ్ అంటే.. తమ భేటీ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. ఇరువురి మధ్య టెరిఫిక్ రిలేషన్ ఉండనుందని.. ఆ విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదన్న మాటను కిమ్ తో ట్రంప్ అన్నారు.

దీనికి స్పందనగా కిమ్ రియాక్ట్ అవుతూ.. ఇంతవరకూ రావటం మామూలు విషయం కాదని.. తమ ముందు గతం ఎన్నో అడ్డంకుల్ని ఉంచిందన్నారు. కానీ.. వాటన్నింటిని అధిగమించి మరీ మనం ఈ రోజు ఇక్కడి వరకూ వచ్చామన్నారు. తొలుత ఆచితూచి అన్నట్లుగా మొదలైన వీరి భేటీ.. కాసేపటికే ఇరువురు నేతలు హుషారుగా వ్యవహరించటం.. పరస్పరం స్నేహపూర్వకంగా కలిసిపోవటం ఆసక్తికరంగా మారింది.

అయితే.. ఇరువురి భేటీకి సంబందించి కీలకమైన అణ్వస్త్ర రహిత ఒప్పందంపై కిమ్ ఎలా రియాక్ట్ కానున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. కిమ్ తో భేటీకి సంబంధించి ట్రంప్ స్పందిస్తూ.. తామిద్దరం పెద్ద సమస్యను.. పెద్ద సందిగ్ధాన్ని పరిష్కరించినట్లుగా చెప్పారు. కలిసి పని చేస్తూ.. కలిసి సమస్యలు పరిష్కరించుకుంటామని వ్యాఖ్యానించటం చూస్తే.. సానుకూల వాతావరణంలో పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా చెప్పక తప్పదు.