మాతో యుద్ధం మీకే నష్టం: చైనా

0Colonel-Wu-Qianడోక్లాం విష‌యంలో తమ శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను త‌క్కువగా అంచ‌నా వేసి, స‌రిహ‌ద్దు యుద్ధంలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌ద్ద‌ని భార‌త్‌ను చైనా మరోసారి హెచ్చ‌రించింది. చైనా పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీతో యుద్ధం క‌న్నా ప‌ర్వ‌తాన్ని క‌దిలించ‌డం సులువు అంటూ చైనా ఆర్మీ ప్ర‌తినిధి వూ కియాన్ భార‌త్‌కు హిత‌బోధ చేశారు. ఒక‌ప్ప‌టితో పోలిస్తే చైనా మిల‌ట‌రీ ద‌ళం బాగా అభివృద్ధి చెందింద‌ని ఆయన గుర్తుచేశారు. చైనా, భూటాన్‌, భార‌త్ త్రి కూడలి ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం జరగకుండా అడ్డుకోవడమే కాదు, త‌మ భూభాగంలోకి భార‌త సైన్యం చొచ్చుకొస్తుంద‌ని చైనా ప్ర‌తినిధి ఆరోపించారు.

శాంతి చ‌ర్చ‌లు జ‌ర‌పాలంటే ముందు తమ సైన్యాన్ని భారత్ వెన‌క్కి పిలిపించాల‌ని ఆయ‌న కోరారు. అలా కాకుండా ముంద‌డుగు వేస్తే భార‌త్‌ త‌మ అదృష్టాన్ని పరీక్షించుకోవ‌డ‌మే అవుతుంద‌ని కియాన్ హెచ్చ‌రించారు. చైనా మిల‌ట‌రీ గురించి త‌ప్పుగా ఊహించుకుని భార‌త్ ముంద‌డుగు వేయ‌కుంటే మంచిది. అలాగే త‌న త‌ప్పు తెలుసుకుని మా అధికారుల‌తో వీలైనంత త్వ‌ర‌గా శాంతి చ‌ర్చ‌లు జరిపితే గానీ స‌రిహ‌ద్దు వ‌ద్ద ప‌రిస్థితి మెరుగుప‌డ‌దని కియాన్ అన్నారు.

తమ జాతీయ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటానికి ఎంతకైనా తెగిస్తామని, దీన్ని ఎవరూ కదలించలేరని కియాన్ వ్యాఖ్యానించాడు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటుచేసి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పై విధంగా స్పందించారు. తమ సౌర్వభౌమాధికారం, సమగ్రత విషయాల్లో 90 ఏళ్ల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చరిత్రలో ఎప్పుడూ ఓటమి లేదని అన్నారు. గత నెలన్నర రోజుల నుంచి డోక్లామ్ ప్రాంతంలో భారత్, చైనా సైన్యాలు మెహరించడంతో తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 1962లో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని చైనా వ్యాఖ్యానిస్తే, అప్పటి భారత్ కాదంటూ ధీటుగా బదులిచ్చారు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ.