టాక్ బాగున్నా వసూళ్లు పూర్

0కొంత కాలంగా యుఎస్ లో తెలుగు సినిమాల సందడేం పెద్దగా కనిపించడం లేదు. మే నెలలో ‘భరత్ అనే నేను’ మహానటి సందడి చేశాక.. ఇంకే సినిమా కూడా ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అందులోనూ ఈ నెలలో వచ్చిన సినిమాలన్నీ అక్కడ తుస్సుమనిపించాయి. తొలి వారంలో విడుదలైన ‘ఆఫీసర్’.. ‘రాజుగాడు’ అడ్రస్ లేకుండా పోయాయి. తర్వాతి వారం వచ్చిన ‘కాలా’ కూడా సత్తా చాటలేదు. ఇక ఈ వారాంతంలో ఒకటికి రెండు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఒక సినిమాకు పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. దాని గురించి పట్టించుకునేవాళ్లే లేరు. ఇంకో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో వసూళ్లు రావట్లేదు.

నందమూరి కళ్యాణ్ రామ్-తమన్నా జంటగా నటించిన ‘నా నువ్వే’ సినిమాకు ఎంత పేలవమైన టాక్ వచ్చిందో తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. వీకెండ్లో మంచి వసూళ్లు వచ్చే శనివారం ఈ చిత్రం కేవలం 9 వేల డాలర్లు మాత్రమే రాబట్టింది. దీనికి పోటీగా విడుదలైన ‘సమ్మోహనం’కు మంచి టాకే వచ్చింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. గురు శుక్రవారాల్లో కలిపి ఈ చిత్రం 1.5 లక్షల డాలర్లు వసూలు చేసింది. శనివారం వసూళ్లు పుంజుకుంటాయని.. పెద్ద నంబర్లే నమోదవుతాయని ఆశించారు. కానీ ఈ చిత్రం 1.2 లక్షల డాలర్లే వసూలు చేసింది. యుఎస్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమానే అయినా.. పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకున్నా ఈ చిత్రానికి వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ‘మహానటి’ సినిమాలో స్టార్ పవర్ లేకున్నా కూడా ఆ చిత్రం మిలియన్లు మిలియన్లు కొల్లగొట్టింది. కానీ ‘సమ్మోహనం’ దాంతో పోలిస్తే చాలా పూర్ గా పెర్ఫామ్ చేస్తోంది. సుధీర్ బాబుకు అసలిక్కడ ఏమాత్రం మార్కెట్ లేకపోవడం ప్రతికూలంగా మారినట్లుంది.