ఆ లెజెండ్ తో ఈ లెజెండ్ కొడుకు

0

దక్షిణాదిన మరో భారీ ప్రాజెక్టుకు రంగం సిద్ధమవుతోంది. లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు-2’ చిత్రం అతి త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ నెలాఖర్లో ‘2.0’ రిలీజయ్యాక కొన్ని రోజుల్లోనే శంకర్ ఈ ప్రాజెక్టును మొదలు పెట్టనున్నాడు. 90ల్లో వచ్చిన ‘భారతీయుడు’ ఎంతటి సంచలనం రేపిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణాది సినీ చరిత్రలోనే ఇది ఒక మైలురాయిలా నిలిచిపోయింది. దీనికి దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత సీక్వెల్ రాబోతుండటంతో అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్న నటీనటుల గురించిన విశేషాలు ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. కమల్ సరసన ఇందులో కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే విలన్ పాత్రకు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ఎంపికనట్లు వార్తలొస్తున్నాయి.

తాజాగా మరో ఆసక్తికర పేరు తెరమీదికి వచ్చింది. ‘భారతీయుడు-2’లో మలయాళ లెజెండరీ నటుడు.. కమల్ హాసన్ మిత్రుడు అయిన మమ్మట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ నటించబోతున్నాడట. చాలా తక్కువ సినిమాలతోనే తండ్రికి తగ్గ వారసుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు దుల్కర్. తమిళంలో ‘ఓకే కణ్మణి’.. తెలుగులో ‘మహానటి’.. హిందీలో ‘కార్వాన్’ దుల్కర్ స్థాయిని తెలియజెప్పాయి. బహు భాషల్లో సత్తా చాటిన ఈ నటుడికి ‘భారతీయుడు-2’లో ప్రత్యేక పాత్ర ఇస్తున్నాడట శంకర్. అతడిని పెట్టుకుంటే వివిధ భాషల్లో సినిమాకు సేలబిలిటీ మరింత పెరుగుతుందని భావించాడట శంకర్. ‘భారతీయుడు’లో కమల్ కు కొడుకుగా కమల్ నే నటింపజేసిన శంకర్.. ఇందులో లోకనాయకుడితో ద్విపాత్రాభినయం చేయించకుండా మనవడిగా ఏమైనా దుల్కర్ ను చూపిస్తాడా అన్న చర్చ మొదలైంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు.. సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తారట.
Please Read Disclaimer