మరో క్రేజీ మల్టిస్టారర్ లో వెంకీ

0ఈమధ్య తెలుగులో మూడు ట్రెండ్స్ మొదలయ్యాయి. ఒకటి బయోపిక్కులు.. రెండు బోల్డ్ సినిమాలు..మూడు మల్టిస్టారర్లు.  ఇప్పటికే చాలా బయోపిక్ లు సెట్స్ మీద ఉన్నాయి మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి.  ఇక బోల్డ్ సినిమాలతో ఒకవైపు మూతి ముద్దులు మరోవైపు రక్తం చిందించడాలు ఎక్కువయ్యాయి.  మూడో ట్రెండ్ మల్టిస్టారర్ సినిమాలు. నాగ్ -నాని మల్టి స్టారర్ ఈనెలలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. చరణ్ – ఎన్టీఆర్ మల్టిస్టారర్ ప్రీ-ప్రొడక్షన్ లో ఉంది.

ఇక మల్టి స్టారర్ సినిమాల్లో అందరి కంటే ఎక్కువ జోరు చూపిస్తున్న హీరో విక్టరీ వెంకటేష్. ఇప్పటికే వరుణ్ తేజ్ తో ‘F2’.. నాగ చైతన్యతో ‘వెంకీ మామ’ అనే రెండు మల్టిస్టారర్లలో నటిస్తున్నాడు వెంకీ. ఈ రెండు కాకుండా మరో క్రేజీ మల్టిస్టారర్ కు పచ్చ జెండా ఊపాడని ఫిలిం నగర్ టాక్. ఈసారి టాలీవుడ్ హీరోతో కాకుండా మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో కలిసి నటిస్తాడట వెంకీ. ఈ సినిమా స్టొరీ యద్ధనేపథ్యంలో సాగుతుందట. భారీ బడ్జెట్ వార్ డ్రామా అని – ఈ సినిమాకు ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తారని సమాచారం. ఇతర వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

‘ఓకే బంగారం’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ ‘మహానటి’ సినిమాలో జెమిని గణేశన్ పాత్ర పోషించి అందరినీ మెప్పించాడు. ఇక వెంకటేష్ తో దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ అంటే ఇది అనౌన్స్ మెంట్ వచ్చిన రోజే క్రేజీ ప్రాజెక్టుగా మారడం ఖాయం.