డీజే లీక్.. ఇంటర్నెట్‌లో హల్‌చల్

0DJ-Duvvada-Jagannadhamటెక్నాలజీ జోరు పెరుగుతున్న క్రమంలో లీకుల గొడవ కూడా ఎక్కువగా వినిపిస్తున్నది. గతంలో అత్తారింటికి దారేది, బాహుబలి చిత్రాల లీకుల వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రానికి కథ ఇదేనంటూ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్ర కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది.

దువ్వాడ జగన్నాథం ఓ అగ్రహారంలో వంట మనిషిగా పనిచేస్తుంటాడు. ఏ ఫంక్షన్ జరిగినా అన్నీ తానై చూసుకొంటాడు. ఓ ఫంక్షన్‌లో పూజా హెగ్డేతో పరిచయం అవుతుందట. తొలిచూపులోనే ఆమెను జగన్నాథం ప్రేమిస్తాడు. అగ్రహారంలో బ్రహ్మణుల పేరు మీద ఉన్న కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి ఉంటుంది. దానిని ఎలాగైనా కబ్జా చేయాలని రొయ్యల నాయుడు (రావు రమేశ్) ప్లాన్ వేస్తాడు.

ఫారిన్ కేంద్రంగా చేసుకొని అక్రమ దందా చేసే మాఫియా డాన్ ఇదే భూమిపై కన్నేస్తాడు. తన అనుచరులకు పురమాయిస్తాడు. మాఫియా డాన్ గ్యాంగ్‌ను ఆటకట్టించి విలన్ ఎదుర్కొనేందుకు డీజేగా మారి విదేశాలకు వెళ్తాడు. అక్కడ విలన్‌ను చూసిన డీజే షాక్ గురవుతాడట. మాఫియా డాన్‌ను చూసి డీజే ఎందుకు షాక్ అయ్యాడు. డీజేకి, మాఫియా డాన్‌కు సంబంధమేమిటి. దువ్వాడ జగన్నాథం అసలు కథ ఏంటి? జగన్నాథంగా ఎందుకు మారాడు? రొయ్యల నాయుడు ఆటలను ఎలా కట్టించాడు, పూజా, అల్లు అర్జున్ ప్రేమకథ ఎలా ముగింపు కార్డు పడింది అనే ప్రశ్నలకు సమాధానమే దువ్వాడ జగన్నాథం కథ.

దువ్వాడ జగన్నాథంలో అల్లు అర్జున్ రెండు కోణాలన్న పాత్రను అద్భుతంగా చేశాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నది. పూజా హెగ్డే, అల్లు అర్జున్ మధ్య సన్నివేశాలను దర్శకుడు హరీశ్ శంకర్ చక్కగా తెరకెక్కించాడని తెలుస్తున్నది. పూజా, అల్లు అర్జున్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్టు సమాచారం.

ఈ చిత్రం కథ రొటీన్‌గా ఉన్నప్పటికీ.. క్లైమాక్స్ అదిరిపోయిందంటూ ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతున్నది. ఊహించిన విధంగా ముగింపు ఉంటుందట. ఈ క్లైమాక్స్‌ను చాలా స్టైలిష్‌గా ఫినిష్ చేశారనేది తాజా సమాచారం.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆడియో సూపర్ హిట్ అయింది. ట్రైలర్లు, టీజర్లకు యూట్యూబ్‌లో అద్భుతమైన రెస్పాన్ వచ్చింది. దేవీ పాటలకు పూజ, అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు సూపర్‌గా ఉన్నాయనే టాక్ అభిమానుల్లో నెలకొన్నది. ఈ చిత్రానికి దాదాపు అంతా సానుకూల వాతావరణమే ఉంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు దువ్వాడా జగన్నాథం చిత్రం ప్రత్యేకమైనది. నిర్మాతగా ఆయనకు 25వ చిత్రం. తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ నిర్మాత అనే పేరు దిల్ రాజు ఉంది. దువ్వాడ జగన్నాథం హిట్ అనే మాటను స్వయంగా ఆయనే ప్రకటించారు. అయితే ఈ చిత్రం సక్సెస్ ఏ రేంజ్ అనేది రిలీజ్ రోజున తెలుస్తుంది అని ఆయన చెప్పడం విశేషం.

ఇదిలా ఉండగా లీకైన కథ వాస్తవమైనదా లేక కట్టుకథనా అనేది శుక్రవారం సినిమా చూస్తే తప్పా అసలు విషయం బోధపడదు. ఆడియో, టీజర్లు, ట్రైలర్లకు విపరీతమైన రెస్పాన్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే రంజాన్ పండుగ నేపథ్యంలో లాంగ్ వీకెండ్ కూడా దువ్వాడకు కలిసి వచ్చే అంశం.