‘భరత్ అనే నేను’ నిర్మాత ఆగ్రహం

0‘భరత్ అనే నేను’ సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న టాప్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య గురించి తాజాగా కొన్ని వదంతులు వినిపించాయి. ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ కియారా అద్వానీకి.. దర్శకుడు కొరటాల శివకు పూర్తి రెమ్యూనరేషన్ చెల్లించలేదని.. వాళ్లకు పెండింగ్ పెట్టారని ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఐతే ఈ ప్రచారాన్ని దానయ్య ఖండించాడు. ఈ వార్తలపై ఆయన మండి పడ్డాడు.

‘భరత్ అనే నేను’కు సంబంధించి అందరికీ చెల్లింపులు పూర్తి చేశామని.. ఎవ్వరికీ పెండింగ్ పెట్టలేదని దానయ్య స్పష్టం చేశాడు. కియారాకు పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే ఆమె మళ్లీ తన బేనర్లో ఇంకో సినిమా ఎందుకు చేస్తుందని ఆయన ప్రశ్నించాడు. కొరటాల విషయంలోనూ డ్యూస్ ఏమీ లేవని దానయ్య స్పష్టం చేశాడు. ‘భరత్ అనే నేను’కు సంబంధించి బిజినెస్ డీల్స్ కూడా కొరటాల శివ చూసుకున్నాడని.. ఆయనకు కూడా పూర్తి చెల్లింపులు చేశామని.. తమ సంస్థ పట్ల నిరాధార ఆరోపణలు తగవని దానయ్య చెప్పాడు. కొరటాల సహా ‘భరత్ అనే నేను’ టీంలో ఎవ్వరితోనూ తనకు ఏ సమస్యా లేదన్నాడు.

ఇంతకుముందు ఆచితూచి సినిమాలు చేసిన దానయ్య ఇప్పుడు వరుసగా భారీ చిత్రాలతో బిజీ అయ్యాడు. ‘భరత్ అనే నేను’ తర్వాత రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని నిర్మిస్తున్న దానయ్య.. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.