మహేష్.. చరణ్.. వెంటనే బన్నీ

0ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతల్లో డీవీవీ దానయ్య టైం నడుస్తోంది. ఆయనున్న ఊపులో మరెవ్వరూ లేరు. ఇంతకుముందు అప్పుడప్పడూ ఒక పెద్ద సినిమా చేస్తూ వచ్చిన ఆయన.. ఉన్నట్లుండి జోరు పెంచారు. వరుసగా భారీ చిత్రాలతో హోరెత్తించేస్తున్నారు. ఆయన దూకుడు చూసి మిగతా నిర్మాతలకు అసూయ పుడుతోంది. ఆల్రెడీ మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ లాంటి భారీ సినిమా తీశాడు దానయ్య. ఇప్పటిదాకా తన కెరీర్లో ఎన్నడూ లేనంత భారీగా ఈ చిత్రానికి ఖర్చు పెట్టాడు. అందుకు తగ్గట్లే బిజినెస్ కూడా జరిగింది. బయ్యర్లకు స్వల్ప నష్టాలు మిగిల్చినప్పటికీ ఆ చిత్రం మంచి ఆదాయమే తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదలకు ముందే రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా మొదలుపెట్టాడు దానయ్య. ఆ సినిమా చిత్రీకరణ తుది దశకు వస్తోంది.

మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్-ఎన్టీఆర్లతో భారీ మల్టీస్టారర్కు సన్నాహాలు చేస్తున్నాడు దానయ్య. ఆ చిత్రం ఏకంగా రూ.250 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కబోతోంది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు దానయ్య చేతికి రావడం విశేషం. ‘నా పేరు సూర్య’ తర్వాత అల్లు అర్జున్ సైతం దానయ్య ప్రొడక్షన్లోనే నటించబోతున్నాడు. అతను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇటీవలే ఫైనల్ నరేషన్ పూర్తయింది. ఇక సినిమాను ప్రకటించడమే తరువాయి అంటున్నారు. మరి బన్నీకి దానయ్యతో ముందే కమిట్మెంట్ ఉందా.. లేక ఈ మధ్యనే ఒప్పందం కుదిరిందా అన్నది తెలియదు కానీ.. ఆయనకే సినిమా చేయబోతున్నాడతను. ఇంతకుముందే బన్నీతో ‘దేశముదురు’.. ‘వరుడు’.. ‘జులాయి’ సినిమాలు నిర్మించాడు దానయ్య.