అన్నీ ఉన్నా అవకాశాలు లేవే!

0సినిమా పరిశ్రమలో కొందరి కెరీర్లు భలే విచిత్రంగా ఉంటాయి. కొందరికి అందం అభినయం అన్ని ఉన్నా అవకాశాలు ఉండవు. అవేవి లేకపోయినా స్టార్లు అయిపోతారు మరికొందరు. అది అదృష్టం అనాలో లేక టైమింగ్ అనాలో చెప్పలేం కానీ ఏది మన చేతుల్లో ఉండదు అనే దానికి ఇవన్నీ ఉదాహరణగా నిలుస్తాయి. హీరోయిన్ ఈషా రెబ్బ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. ఐదేళ్ల క్రితం సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో అంతకుముందు ఆ తర్వాత సినిమా ద్వారా సుమంత్ అశ్విన్ సరసన పరిచయమైన ఈషాకు దాని తర్వాత అవకాశాలు వెల్లువెత్తలేదు. ఆ మూవీ యావరేజ్ కావడం ఒక కారణం అయితే ఈషా హైట్ పరంగా కాస్త ఎక్కువ ఎత్తుగా అనిపించడంతో పాటు హిట్ సినిమా తన ఖాతాలో లేకపోవడం.

ఏదైతేనేం నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత అమీ తుమీ రూపంలో అదే దర్శకుడు ఇచ్చిన బ్రేక్ తో పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. తర్వాత సుకుమార్ నిర్మాణంలో వచ్చిన దర్శకుడు ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ నాని నిర్మించిన అ!! ఛాన్సులు తీసుకురావడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈషాకున్న అతి పెద్ద హోప్ అరవింద సమేత వీర రాఘవ. కానీ అందులో మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే. ఈషాకు ఇచ్చింది ఫ్లాష్ బ్యాక్ లో కాసేపు కనిపించే పాత్ర అని ఇప్పటికే టాక్ ఉంది. అది ఎంత వరకు ఉపయోగపడుతుందో చెప్పలేం. వచ్చే నెల 3న విడుదల కానున్న బ్రాండ్ బాబులో కొత్త హీరో సరసన చేసింది. అందులో హీరోయిన్ అయినప్పటికీ అది గ్లామర్ గా ఉండే పనిమనిషి పాత్ర. మరి తాను కోరుకున్న పెద్ద బ్రేక్ వీటి ద్వారా రావడం కష్టమే.

అయినా తన టాలెంట్ ని గుర్తించే సినిమా ఒకటి వస్తుందనే నమ్మకంతో ఉందీ తెలుగమ్మాయి. మరి తన కోరిక నెరవేరాలంటే స్టార్ హీరో సరసన సోలో హీరోయిన్ గా ఏదైనా ఆఫర్ వస్తే అది తీరే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంది కాని అందులో తనది పరిమిత పాత్ర కాబట్టి ఇంకా స్కోప్ ఉన్న రోల్ కోసం వెయిట్ చేస్తోంది. అప్పటి దాకా తనతో పాటు అభిమానులకు ఎదురు చూపులు తప్పవు.