పోరాడి ఓడిన భారత మహిళలు

0Womens World cup Finalsఆశలకు తెరపడింది. ఓ సువర్ణావకాశం చేజారింది. అసాధారణ ప్రదర్శనతో అలరించినా.. అంకితభావంతో గొప్పగా పోరాడినా కలల కప్పు చిక్కినట్లే చిక్కి చేజారింది. గెలుపు ముంగిట భారత్‌ బోల్తా కొట్టింది. విజయం అంచుల వరకూ వెళ్లిన మిథాలీసేన, మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో భంగపడింది. మహిళల క్రికెట్‌కే గొప్ప మలుపుగా భావిస్తున్న టోర్నీలో ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌గా అవతరించింది.

అది 43వ ఓవర్‌. భారత్‌ 191/3. గెలవాలంటే చేయాల్సింది ఇంకా 38 పరుగులే. చాలినన్ని బంతులు. మరీ ఒత్తిడేమీ లేదు. ఓ వైపు పూనమ్‌ రౌత్‌ క్రీజులో పాతుకు పోగా.. మరోవైపు దూకుడుగా ఆడుతున్న వేద కృష్ణమూర్తి ఉంది. ఇద్దరూ అలవోకగా బ్యాటింగ్‌ చేస్తుంటే.. భారత అభిమానుల్లో కప్పు చిక్కినట్లేనన్న ధీమా. కానీ ఆశలు అడియాసలు చేస్తూ భారత్‌ అనూహ్యంగా తడబడింది. ష్రబ్‌సోల్‌ విజృంభించడంతో 28 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకుని ఓటమిని కొనితెచ్చుకుంది.

ఓడితేనేం.. కప్పు చేజారితేనేం.. చిరస్మరణీయ ప్రదర్శనతో, పోరాటపటిమతో మిథాలీసేన కోట్లాది భారతీయుల మనసులు గెలిచింది. మహిళల క్రికెట్‌నూ అభిమానులు విశేషంగా ఆదరించేలా చేయడం ఈ జట్టు సాధించిన విజయం!england-Womans-cricket-world-cup

వూరించిన కప్పు కొద్దిలో భారత్‌ చేజారింది. ఉత్కంఠగా ముగిసిన మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ 9 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయంపాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట ఇంగ్లాండ్‌ 7 వికెట్లకు 228 పరుగులు చేసింది. సైవర్‌ (51; 68 బంతుల్లో 5×4), సారా టేలర్‌ (62 బంతుల్లో 45) రాణించారు. జులన్‌ గోస్వామి (3/23), పూనమ్‌ యాదవ్‌ (2/36) ఇంగ్లాండ్‌ కట్టడిలో కీలక పాత్ర పోషించారు. పూనమ్‌ రౌత్‌ (86; 115 బంతుల్లో 4×4, 1×6), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (51; 80 బంతుల్లో 3×4, 2×6)ల చక్కని బ్యాటింగ్‌తో భారత్‌ విజయం దిశగా సాగినా.. ష్రబ్‌సోల్‌ (6/46) ధాటికి అఖర్లో తడబడింది. 48.4 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. ష్రబ్‌సోల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. బీమౌంట్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికైంది.

లక్ష్యం మరీ పెద్దదేమీ కాకపోయినా ఛేదనను భారత్‌ పేలవంగా ఆరంభించింది. ఓపెనర్‌ స్మృతి మంధానా (0) రెండో ఓవర్లోనే ష్రబ్‌సోల్‌ బౌలింగ్‌లో బౌల్డయింది. మరో ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌తో జత కలిసిన కెప్టెన్‌ మిథాలీరాజ్‌ ఇన్నింగ్స్‌ను సరిదిద్దేందుకు ప్రయత్నించింది. కానీ స్కోరు బోర్డు నెమ్మదిగా కదలింది. 13వ ఓవర్లో మిథాలీ ఔటయ్యేటప్పటికి స్కోరు 43 పరుగులే. కానీ రౌత్‌కు ఫామ్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్‌ తోడు కావడం భారత్‌ బలపడింది. ముందు నెమ్మదిగా ఆడినా ఈ జోడీ క్రమంగా వేగంగా పెంచింది. అప్పుడప్పుడు బౌండరీలు కొడుతూ, క్రమం తప్పకుండా సింగిల్స్‌ తీస్తూ స్కోరు వేగాన్ని పెంచింది. 30 ఓవర్లకు స్కోరు 120/2. ఆ తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆట కొనసాగించారు. ఐతే 34వ ఓవర్లో హర్మన్‌ను హార్ట్‌లే ఔట్‌ చేయడంతో 95 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఐతే స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసిన వేద(35; 34 బంతుల్లో 5×4)తో రౌత్‌ మరో విలువైన భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్‌ విజయం దిశగా సాగింది. 42 ఓవర్లకు స్కోరు 182/3. భారత్‌ గెలుపు ఖాయమనిపించింది. కానీ రౌత్‌ను ష్రబ్‌సోల్‌ ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ గమనం మారింది. సాఫీగా లక్ష్యాన్ని ఛేదించే వీలున్నా.. ఒత్తిడికి గురైన భారత్‌.. ష్రబ్‌సోల్‌ విజృంభణతో 19 పరుగులకే మిగతా 6 వికెట్లు చేజార్చుకుని ఓటమిపాలైంది.

జులన్‌ సూపర్‌ బౌలింగ్‌: జులన్‌ గోస్వామి. ఈ భారత ఏస్‌ పేసర్‌ పేరు టోర్నీలో పెద్దగా వినపడనే లేదు. కానీ అసలైన పోరులో ఈ అమ్మాయి అదరగొట్టింది. బ్యాట్స్‌వుమన్‌కు ఏమాత్రం స్వేచ్ఛనివ్వకుండా బౌలింగ్‌ చేసిన జులన్‌.. ఇంగ్లాండ్‌ను కట్టిపడేసింది. ప్రపంచకప్‌ ఫైనల్లోనే మూడో అత్యుతమ గణాంకాలు నమోదు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు మంచి ఆరంభమే లభించింది. 11 ఓవర్లకు 47/0. ఆ స్థితిలో విన్‌ఫీల్డ్‌ (24)ను ఔట్‌ చేయడం భారత్‌కు తొలి వికెట్‌ను అందించింది. ఆ తర్వాత పూనమ్‌ వరుస ఓవర్లలో బీమౌంట్‌ (23), నైట్‌ (1)లను ఔట్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ 63/3కు పరిమితమైంది. ఆ దశలో సారా టేలర్‌, సైవర్‌ ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు. దీంతో ఇంగ్లాండ్‌ 30 ఓవర్లలో 133/3తో మంచి స్కోరు దిశగా సాగింది. ఐతే భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న దశలో ఇంగ్లాండ్‌ను జులన్‌ దెబ్బతీసింది. 35 ఓవర్లో వరుసగా బంతుల్లో టేలర్‌, విల్సన్‌లను ఔట్‌ చేసి భారత్‌ను మ్యాచ్‌లోకి తెచ్చింది. చక్కని ఇన్నింగ్స్‌ ఆడిన సైవర్‌ను కూడా కాసేపటి తర్వాత జులన్‌ ఔట్‌ చేసింది. ఆమెను వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. అప్పటికి ఇంగ్లాండ్‌ 164/6. 40వ ఓవర్లో జులన్‌ స్పెల్‌ పూర్తవడంతో ఆ జట్టు కాస్త వూపిరి పీల్చుకుంది. మిగతా బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్‌ చేసినా.. బ్రంట్‌ (34), గన్‌ (25 నాటౌట్‌), లారా మార్ష్‌ (14 నాటౌట్‌)లు ఇంగ్లాండ్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించారు.

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: విన్‌ఫీల్డ్‌ (బి) రాజేశ్వరి 24; బీమౌంట్‌ (సి) జులన్‌ (బి) పూనమ్‌ యాదవ్‌ 23; సారా టేలర్‌ (సి) సుష్మా వర్మ (బి) జులన్‌ 45; నైట్‌ ఎల్బీ (బి) పూనమ్‌ యాదవ్‌ 1; సైవర్‌ ఎల్బీ (బి) జులన్‌ 51; విల్సన్‌ ఎల్బీ (బి) జులన్‌ 0; బ్రంట్‌ రనౌట్‌ 34; గన్‌ నాటౌట్‌ 25; లారా మార్ష్‌ నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 228; వికెట్ల పతనం: 1-47, 2-60, 3-63, 4-146, 5-146, 6-164, 7-196

బౌలింగ్‌: జులన్‌ గోస్వామి 10-3-23-3; శిఖాపాండే 7-0-53-0; రాజేశ్వరి గైక్వాడ్‌ 10-1-49-1; దీప్తి శర్మ 9-0-39-0; పూనమ్‌ యాదవ్‌ 10-0-36-2; హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 4-0-25-0

భారత్‌ ఇన్నింగ్స్‌: పూనమ్‌ రౌత్‌ ఎల్బీ (బి) ష్రబ్‌సోల్‌ 86; స్మృతి మంధాన (బి) ష్రబ్‌సోల్‌ 0; మిథాలీరాజ్‌ రనౌట్‌ 17; హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి) బీమౌంట్‌ (బి) హార్ట్‌లే 51; వేద (సి) సైవర్‌ (బి) ష్రబ్‌సోల్‌ 35; సుష్మా వర్మ (బి) హార్ట్‌లే 0; దీప్తి శర్మ (సి) సైవర్‌ (బి) ష్రబ్‌సోల్‌ 14; జులన్‌ (బి) ష్రబ్‌సోల్‌ 0; శిఖా పాండే రనౌట్‌ 4; పూనమ్‌ యాదవ్‌ నాటౌట్‌ 1; రాజేశ్వరి గైక్వాడ్‌ (బి) ష్రబ్‌సోల్‌ 0; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (48.4 ఓవర్లలో ఆలౌట్‌) 219; వికెట్ల పతనం: 1-5, 2-43, 3-138, 4-191, 5-196, 6-200, 7-201, 8-218, 9-218; బౌలింగ్‌: బ్రంట్‌ 6-0-22-0; ష్రబ్‌సోల్‌ 9.4-0-46-6; సైవర్‌ 5-1-26-0; గన్‌ 7-2-17-0; లారా మార్ష్‌ 10-1-40-0; హార్ట్‌లే 10-0-58-2; నైట్‌ 1-0-7-0