కార్తికేయకు నెగెటివ్ షేడ్ పాత్రల ఆసక్తి

0

హీరోలు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించడం నేటి ట్రెండ్ గా మారుతోందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. అపుడెపుడో వర్షం సినిమాలో గోపిచంద్ కరుడుగట్టిన విలన్ గా కనిపించి మెప్పించాడు. త్రిషను మోహించి గొడవకు దిగే వాడిగా ప్రభాస్ కి ధీటుగా పోటీపడి నటించి మెప్పించాడు ఎగ్రెస్సివ్ హీరో. అలాగే మరో నవతరం హీరో రానా సైతం బాహుబలి చిత్రంలో విలన్ గానే నటించి మెప్పించారు. ప్రతినాయక లక్షణాలున్న భళ్లాల దేవగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కాస్త సీనియర్ నటుడే అయిన నవదీప్ ఆర్య 2లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చిత్రంలోనూ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించాడు.

అదంతా సరే.. హీరో నాని.. ఆర్.ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా ప్రస్తుతం విలన్ పాత్రలకు సంతకం చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ఇద్దరూ ప్రస్తుతం నటించే సినిమాల్లో విలన్లుగా నటిస్తుండడం పై అభిమానుల్లో చర్చకు తావిచ్చింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ లో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంటే నానీ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో హీరోగా సుధీర్ బాబు నటిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

`ఆర్.ఎక్స్ 100` తో బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత వరుసగా సినిమాలకు సంతకాలు చేసిన క్రేజీ హీరో కార్తికేయ ఇప్పటికిప్పుడు హిప్పీ – గుణ 369 అంటూ బిజీ అయిపోయాడు. ఈ రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్న అతడు తదుపరి నాని – విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ సినిమాలో విలన్ గా నటించేందుకు సంతకం చేశాడని తెలుస్తోంది. కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడని ఇదివరకూ ప్రచారమైంది. ఇప్పటికి దీనిపై క్లారిటీ వచ్చేసింది . అతడు నాని సినిమాలో పీకలు కోసే విలనీ చేయబోతున్నాడన్నది పెద్ద ట్విస్టు. అయితే నవతరం హీరోలు విలనీ చేస్తే రిస్క్ అని భావించడం లేదు. వెరైటీ .. కొత్తదనం ఫీలవుతున్నారు. నటించేందుకు స్కోప్ ఉన్న ఏ పాత్రలో అయినా నటించేందుకు సిద్ధమేనని నేటి తరం హీరోలు ప్రకటిస్తున్నారు. ఇక ఆది పినిశెట్టి .. అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర వంటి వారు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు అయినా నటించేందుకు అన్నివేళలా సిద్ధమేనని ప్రకటించారు. మరో నవతరం హీరో మనోజ్ నందం ప్రస్తుతం ఓ చిత్రంలో విలన్ గా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడు. ఇలా హీరోలంతా వైవిధ్య ం కోసం తపించడం కొత్త పరిణామమనే చెప్పాలి.
Please Read Disclaimer