వాళ్లు 30 కోట్ల నష్టాన్ని భరించారా?

0టాలీవుడ్లో మీడియం రేంజ్ హీరోల మీద కూడా 20 కోట్లకు మించి బడ్జెట్ పెట్టడానికి సంకోచిస్తారు. రవితేజ లాంటి స్టార్ కూడా ఈ రేంజిలోనే సినిమాలు చేస్తుంటాడు. అలాంటిది ఏ ఇమేజ్ లేని యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ సినిమాలకు మాత్రం 30 కోట్లు.. 40 కోట్లని బడ్జెట్లు కొండెక్కించేస్తుండటం చాలా షాకింగ్ గా అనిపిస్తూ ఉంటుంది జనాలకు. అది కూడా బయటి నిర్మాతలు అతడి మీద అంతేసి ఖర్చు పెడుతున్నట్లు కలరింగ్ ఇవ్వడం మరీ ఆశ్చర్యం. ఐతే ఫైనాన్షియర్లు.. బయ్యర్లతో సమస్యలున్న నేపథ్యంలో వాళ్లకు దొరక్కుండా ఉండేందుకు శ్రీనివాస్ తండ్రి సురేషే అతడి సినిమాలకు వెనుక ఉండి బడ్జెట్లో చాలా వరకు పెడతాడని.. వేరే నిర్మాతల్ని ముందు పెట్టి సినిమాలు తీస్తాడని ఇండస్ట్రీలో గట్టి ప్రచారమే ఉంది. ఐతే ఈ వాటాలు ఎలా ఉంటాయన్నది అర్థం కాని విషయమే. సినిమాకు వచ్చే ఆదాయాన్ని ఆయన.. నిర్మాతగా పేరు పడే వ్యక్తి ఎలా పంచుకుంటారన్నదీ ఆసక్తికరమే.

బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా ‘సాక్ష్యం’ విషయానికి వస్తే.. దీనికి 30 కోట్ల పైనే ఖర్చయినట్లు వార్తలొచ్చాయి. సినిమాలో భారీతనం చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఐతే ఈ చిత్రానికి రూ.40 కోట్ల బిజినెస్ జరిగిందని.. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ఈరోస్ ఇంటర్నేషనల్’ కైవసం చేసుకుందని ఘనంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒకప్పుడు మహేష్ లాంటి పెద్ద హీరోల సినిమాల్ని కొని చేతులు కాల్చుకున్న ఈరోస్ వాళ్లు.. మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. అలాంటిది శ్రీనివాస్ లాంటి చిన్న హీరో సినిమాను అంత రేటు పెట్టి కొన్నారంటే నమ్మశక్యం కాలేదు. పైగా ఇప్పుడు చూస్తే ఈ చిత్రానికి రూ.10 కోట్లకు మించి షేర్ రాలేదు. అంటే ఆ సంస్థ ఈ చిత్రం వల్ల రూ.30 కోట్ల నష్టపోయిందా? అంత నష్టం వచ్చినా కిమ్మనకుండా సైలెంటుగా ఉందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి ఈ లెక్కల్లో మతలబు ఏంటో చిత్ర బృందానికే తెలియాలి.