రజనీ వైఫ్ బిజీ అయిపోయేలా ఉందే

0సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘కాలా’లో ఆయన భార్యగా నటించిన ఈశ్వరీరావు తెలుగమ్మాయే అన్న సంగతి చాలామందికి తెలియదు. ఆమె స్వస్థలం పెద్దాపురం కావడం విశేషం. గతంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ‘రాంబంటు’లో ఈశ్వరి హీరోయిన్ గా కూడా చేసింది. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించింది. ‘భద్ర’ సినిమాలో హీరోయిన్ వదినగా కూడా చేసింది. కానీ ఇక్కడ ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

మధ్యలో కొన్ని సీరియళ్లలో నటించిన ఈశ్వరిరావు.. చాలా ఏళ్లుగా తెలుగు తెరపై కనిపించడం లేదు. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి సూపర్ స్టార్ రజనీ కాంత్ కే జోడీగా నటించిన ఆశ్చర్యపరిచింది. రజనీ పక్కన ఈశ్వరి ఏంటి అన్నవాళ్ల నోళ్లు సినిమా చూశాక మూత పడ్డాయి. స్వర్ణ రజనీకి దీటుగా నటించి మెప్పించింది ఈశ్వరి. ఈ సినిమాకు తెలుగులో డివైడ్ టాక్ ఉన్నప్పటికీ తమిళంలో పరిస్థితి పర్వాలేదు. ఈశ్వరి నటనకు కూడా అక్కడ మంచి గుర్తింపే లభించింది.

ఈ సినిమా తర్వాత ఈశ్వరీరావు బిజీ అయ్యేలా కనిపిస్తోంది. ‘కాలా’ టీం ఫీడ్ బ్యాక్ తో ఆమెను ముందే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘వర్మ’ కోసం ఎంపిక చేసుకున్నారు. ఇందులో ఆమె ఏ పాత్ర చేస్తోందన్నది తెలియదు కానీ.. కీ రోలే అంటున్నారు. ‘కాలా’ రిలీజ్ తర్వాత ఈశ్వరికి బాగానే ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. మున్ముందు ఆమె బిజీ అయ్యేలాగే ఉంది. మొత్తానికి ఇన్నేళ్లకు తన కెరీర్ ఇలా మలుపు తిరుగుతుందని ఈశ్వరి ఊహించి ఉండదేమో.