అక్టోబర్‌లో ప్రపంచం అంతం!

0european-geosciences-unionఈ ఏడాది అక్టోబర్‌లో ప్రపంచం కనుమరుగుకానున్నదట. భూగ్రహాన్ని నిబిరు అనే గ్రహం ఢీకొట్టేందుకు దూసుకొస్తున్నదట. గత 2003 నుంచి ఇలాంటి వార్తలు మధ్యలో ఆగిపోయినప్పటికీ.. కుట్ర సిద్ధాంతకర్తల ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చాయి. భూగోళం అంతరించిపోతుందనే విషయాన్ని తాజా గా డేవిడ్ మీడే అనే రచయిత ప్లానెట్ టెన్ – ది 2017 అరైవల్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. వందేండ్ల క్రితం కక్ష్యలోని ఇతర గ్రహాలను నిబిరు విచ్ఛిన్నం చేసిందని కుట్ర సిద్ధాంతకర్తల వాదన. సౌర వ్యవస్థ చివరలో ఉన్న దీనిని పదో గ్రహంగా భావిస్తున్నారు. దక్షిణ ధ్రువం వైపు దూసుకొస్తున్న ఈ గ్రహం తనతోపాటు మరో ఏడు గ్రహాలను వెంటబెట్టుకొస్తున్నదని పేర్కొంటున్నారు.

గురుత్వాకర్షణ ప్రభావం వల్ల సౌర వ్యవస్థ నుంచి బయటపడిన ఈ గ్రహం ఈ ఏడాది అక్టోబర్‌లో భూగ్రహాన్ని ఢీకొట్టే అవకాశముందని, అయితే అందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లేవని డేవిడ్ మీడే తెలిపారు. ఈ గ్రహం ఏ దిశగా వస్తుందనే విషయాన్ని గుర్తించడం కష్టమని, దక్షిణ అమెరికాలోని ఎత్తైన ప్రదేశాల్లో అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తే గుర్తించడానికి వీలు పడుతుందన్నారు. రచయిత తన పుస్తకంలో శాస్త్రీయ ఆధారాలను ఓ వైపు వెల్లడించగా, మరోవైపు ఈ విషయాన్ని బైబిల్‌లో దేవుడు కూడా చెప్పాడని పాఠకులు మతపరమైన అంశాన్ని జోడిస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు నిబిరు అనే గ్రహం సౌర కుటుంబంలోనే లేదని శాస్త్ర, సాంకేతిక వర్గాలు పేర్కొంటున్నారు. నిబిరు, ఇతర గ్రహాల కథలన్నీ ఇంటర్నెట్‌లో ప్రచురించే కట్టుకథలని నాసా కొట్టిపడేసింది. ప్రపంచం అంతరించి పోతుందని 2003, 2012, 2015లో ఇలాంటి కథనాలు చాలానే వచ్చాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తు చేశారు.