సంపూ అసలెందుకు వెళ్లిపోయాడంటే..

0Sampu-Reacts-About-Rumorsతెలుగు ‘బిగ్ బాస్’ షోలో ముందు కంటెస్టెంట్లను ప్రకటించినపుడు అందులో ఎక్కువమందిని ఆకర్షించిన పేరు… సంపూర్ణేష్ బాబు. అతడి వల్ల ‘బిగ్ బాస్’కే కళ వస్తుందని.. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఆశించారు జనాలు. ఐతే సినిమాల్లో తనదైన శైలిలో వీరోచిత విన్యాసాలు చేస్తూ.. ఎంటర్టైన్ చేసే సంపూ ‘బిగ్ బాస్’లో మాత్రం బేలగా కనిపించాడు. హౌస్ లోపల ఉండే ఒత్తిడిని తట్టుకోలేక మానసికంగా బాగా దెబ్బ తిని.. షో నుంచి బయటికి వెళ్లిపోయాడు. మరి సంపూ అంతగా ఎందుకు ఒత్తిడికి గురయ్యాడు.. ఏ పరిస్థితుల్లో షో నుంచి బయటికి వచ్చేశాడన్నది వివరంగా జనాలకు తెలియలేదు. తాజాగా ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన సంపూ మిత్రుడు మహేష్ కత్తి ఈ విషయాలు వెల్లడించాడు.

సంపూ సినిమాల్లో కనిపించేదానికి భిన్నంగా నిజ జీవితంలో ఉంటాడని కత్తి చెప్పాడు. అతను చాలా సెన్సెటివ్ అని.. చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన అతను ‘బిగ్ బాస్’ హౌస్ లో ఉండలేకపోయాడని అన్నాడు. తన ఊరిలో స్వేచ్ఛగా తిరుగుతూ.. అందరినీ సరదాగా పలకరిస్తూ మాట్లాడుతూ ఉండే సంపూను ‘బిగ్ బాస్’ హౌస్ లో తాళం వేసి పెట్టేసరికి ఉండలేకపోయాడని తెలిపాడు. ఇది తన బతుకు కాదనుకున్నాడని అన్నాడు. హౌస్ లోపల ప్రేక్షకులకు తెలియని విషయాలు చాలా జరుగుతాయని.. అప్పుడప్పుడూ బ్లైండ్స్ వేసేవాళ్లని.. అలా చేసినపుడు సంపూ భయపడిపోయాడని తెలిపాడు. ఆ సమయంలో తాము ఎంతగా సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని.. డాక్టరుకు చూపించాక కూడా అతను కోలుకోలేదని.. పెయిన్ వస్తోందంటూ ఇంటి నుంచి వెళ్లిపోవడానికే సిద్ధపడ్డాడని మహేష్ చెప్పాడు.

ఒక వారం ఆగమని.. ఇప్పుడే వెళ్లిపోతే నీకు.. షోకు కూడా నష్టమని చెప్పినా.. ఆర్థిక ఇబ్బందుల గురించి వివరించినా.. హౌస్ లో ఉండటం నరకం అనుకునే పరిస్థితి రావడంతో అతను నిష్క్రమించక తప్పలేదని తెలిపాడు. తన పిల్లలకు ఏదో అయినట్లు కల వచ్చిందంటూ ఎమోషనల్ అవడంతో అందరం బలవంతం చేయకుండా సైలెంటైపోయినట్లు కత్తి చెప్పాడు. మహేష్ కత్తి.. సంపూ వ్యక్తిగతంగా మంచి మిత్రులు. వీళ్లిద్దరూ కలిసి హృదయ కాలేయం.. కొబ్బరి మట్ట సినిమాల్లో నటించారు. కత్తి డైరెక్ట్ చేసిన ‘పెసరట్టు’లోనూ సంపూ ఓ కీలక పాత్ర చేశాడు.