రామ్ చరణ్ ఇంటి ముందు రచ్చ చేసిన ఫాన్స్

0fans-hulchal-at-ram-charansనా పేరు సిట్టిబాబండీ. ఈ ఊరికి మనమే ఇంజనీరు. అందరికీ సౌండ్‌ వినపడిద్దండి. నాకు సౌండ్‌ కనపడిద్దండి. అందుకే నన్ను సౌండ్‌ ఇంజినీర్‌ అంటారండి’ అంటూ గోదావరి యాసతో అదరగొట్టేశాడు రామ్‌చరణ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను బుధవారం చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్‌ విడుదలైన కొద్ది సేపట్లోనే లక్షల మంది వీక్షించారు.

అయితే టీజర్‌ విడుదలయ్యాక రామ్‌చరణ్‌ అభిమానులు ఆయన ఇంటి ముందు హంగామా చేశారు. టీజర్‌ అదిరిపోయిందన్నా..అంటూ టపాసులు పేల్చారు. అభిమానులు టపాసులు కాలుస్తున్న వీడియోను చరణ్‌ సతీమణి ఉపాసన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘మా ఇంటి ముందు అభిమానులు ఇలా టపాసులు పేల్చారు. మీ అభిమానానికి ధన్యవాదాలు. మీకు టీజర్‌ నచ్చిందని ఆశిస్తున్నాం’ అని ఉపాసన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతేకాదు.. టీజర్‌ విడుదలయ్యాక చరణ్‌ తన ఇంటి వద్దకు వచ్చిన అభిమానులను ‘టీజర్ ఎలా ఉంది’ అని సైగలు చేస్తూ అడిగారు. దీనికి అభిమానులు బాగుంది అన్నట్టుగా కేకలు వేశారు‌. ఆ తరువాత అందరికీ ధన్యవాదాలు చెప్పి చరణ్‌ లోపలికి వెళ్లిపోయారు.

అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, ధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి తదితరులు టీజర్‌ అద్భుతంగా ఉందంటూ సోషల్‌మీడియా వేదికగా ప్రశంసలు గుప్పించారు. మార్చ్‌ 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం చరణ్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో చరణ్‌కి జోడీగా కైరా అడ్వాణీ నటిస్తున్నారు. మరోపక్క దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్‌ చిత్రంలోనూ చరణ్‌ నటించనున్నారు. ఇందులో చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటించనున్నారు.