ఫిదా చిత్రం; కోట్లొచ్చీన ఏం లాభం లేదు

0fidaa-collections-unstoppableఈ మధ్య కాలంలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్లలో ఫిదా కూడా ఒకటి, యుఎస్‌లో రెండు మిలియన్‌ డాలర్లకి పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమావల్ల లాభం ఎంతొచ్చిందన్నలెక్కలు చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతాయ్. అంతేకాదు మా సినిమా ఇంత గ్రాస్ కలెక్ట్ చేసిందీ అని చెప్పుకునే లెక్కల వెనుక ఉండే అసలు మతలబు తెలిసిపోతుంది. సినిమా డిస్ట్రిబ్యూషన్ అనే ఒక జూదం లో రోడ్డున పడేదాకా వచ్చిన వళ్ళ భాద ఏమిటో అర్థమౌతుంది. ఆ ఫీల్డ్ లోఉన్నవాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ని గుర్రం పందాలతోనూ.., లాటరీ టికెట్ లాంటి వ్యవహారం తోనూ పోల్చుతూంటారు ఎందుకో ఇది చూడండి…

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, సాయిపల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం “ఫిదా”. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫలితంగా హైయ్యెస్ట్ గ్రాసింగ్ టాప్-10 జాబితాలో “ఫిదా” చేరిపోయింది. ముఖ్యంగా సీనియర్ హీరోలు బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “అత్తారింటికి దారేది” వంటి చిత్రాలను వెనక్కినెట్టేయడం గమనార్హం.

అయితే అంత వసూలు చేసినప్పటికీ ఈ చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్‌గా భారీ లాభాలేమీ రాలేదు. నాలుగు కోట్లు పెట్టి రైట్స్‌ తీసుకుంటే, ఈ చిత్రంపై పదమూడు కోట్లకి పైగా గ్రాస్‌ కలక్షన్లు యుఎస్‌లో వచ్చాయి. ఇతర దేశాల నుంచి ఒక ముప్పయ్‌ లక్షలు వసూలయ్యాయి.

పదమూడున్నర కోట్లలో దాదాపు సగం యుఎస్‌ థియేటర్‌ ఓనర్లకే పోయింది. ఖర్చులు పోనూ లాభం మూడు కోట్లు తేలితే, అందులో ఎగ్జిబిటర్ల షేరే ఎక్కువ వుంది. కోటీ డెబ్బయ్‌ అయిదు లక్షలు ఎగ్జిబిటర్లకి పోగా, నాలుగు కోట్లు రిస్కు చేసిన బయ్యర్‌కి కోటీ పాతిక లక్షల లాభం వచ్చింది. ఇది మంచి లాభమే కానీ, ఇక్కడ బ్లాక్‌బస్టర్‌ సినిమా గురించి మాట్లాడుతున్నామని మర్చిపోకూడదు.

అంత భారీ విజయం సాధించిన చిత్రంపై ఇంత తక్కువ లాభం వస్తే ఇక మామూలు సక్సెస్‌ల మాటేమిటి? ఫ్లాపయితే పరిస్థితి ఏమిటి? పరిస్థితి ఇంత ఘోరంగా వుండబట్టే ఈ జూదం ఆడేందుకు ఎక్కువ మంది పంపిణీదారులు సాహసించడం లేదు. ఇదే బిజినెస్‌ని నమ్ముకున్న కొందరు ఉద్ధండులు రోడ్ల మీదకి వచ్చేసి క్యాబ్‌ డ్రైవర్లుగా మారిన ఉదంతాలు కూడా వున్నాయి.