టిఆర్ఎస్: చిచ్చు రేపుతున్న నామినేటెడ్ పోస్టులు

0trs-partyఉమ్మడి వరంగల్ జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చిచ్చు రేపుతోంది. ప్రధానంగా ఛైర్‌పర్సన్‌ల నియామకంతో స్థానిక ఎమ్మెల్యేల ప్రాధాన్యత తగ్గుతున్నట్లుగా చర్చ జరుగుతోంది.

వరంగల్ తూర్పులో ఇన్నాళ్లూ పైకి కలిసే ఉన్నట్లు కనిపించినా.. అంతర్గతంగా మాత్రం ఉప్పు నిప్పులా ఉన్న కొండా సురేఖ, గుండు సుధారాణిలలో ఎవరి గ్రూపులో ఉండాలో తేల్చుకోలేని స్థితిలో నగర కార్పొరేటర్లతో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నారు.

ఛైర్‌పర్సన్‌ల నియామకం తర్వాత వారే స్థానిక ఎమ్మెల్యేల కంటే ఓ స్టెప్ పైనే ఉంటున్నారని కొందరు తమ గాడ్ ఫాదర్లకు చెప్పుకుంటున్నారట. తమ ప్రమేయం లేకుండానే ఎవరికి వారు అధికారుల వద్దకు వెళ్లడం, తాము కేబినెట్ హోదా అంటూ బెదిరించి పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలతో జిల్లాలో పవర్ సెంటర్లు పెంచినట్లయిందని టీఆర్ఎస్ ముఖ్యుడొకరు చెప్పారు.

ఇప్పటివరకు కొత్త జిల్లాల అధ్యక్షుల ఎంపిక జరగకపోగా.. అందరినీ ఊరిస్తూ ఉద్యమంలో మొదటినుంచి పనిచేసిన తమను కాదని ఎవరెవరికో పదవులు ఇస్తున్నారని మరికొందరు వాపోతున్నారు. ప్రధానంగా వరంగల్ నగరంలో ఇప్పటికే మేయర్ నరేందర్, ఎమ్మెల్యే కొండాసురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, డిప్యూటీ సీఎం కడియంలు తమ ప్రాధాన్యం కోసం పోటీ పడుతుండగా.. తాజాగా గుండు సుధారాణి జోడు పదవులతో వీరందరికంటే ఓ మెట్టు పైనే ఉన్నారని పార్టీలో అనుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా పదవుల పందేరం నడుస్తోంది. ఒకవైపు నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు మరోవైపు ఉద్యమకారులను సంతృప్తి పరిచే దిశగా గులాబీ దళపతి దృష్టి సారిస్తున్నారు. ఈ భర్తీ వ్యవహారంలో అధినేత కేసీఆర్ అంతరంగం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఊహించని వ్యక్తులకు ఎవరూ ఊహించని పదవులు వస్తున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్నవారికి అసలు దిక్కే లేకుండా పోతోంది.

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నామినేటెడ్ పోస్టులకు గిరాకీ పెరిగింది. మొదట్లో ప్రతీ ఒక్కరూ తమకు నామినేటెడ్ పోస్టు దక్కుతుందని భావించినా.. నిన్నమొన్నటివరకూ ఆ దిశగా కేసీఆర్ అడుగులు వేయలేదు. ఎప్పుడో అరకొర పదవులు నింపినా.. అవి కూడా ప్రాధాన్యత కలిగిన, ఆ సమయంలో అవసరమైన వాటినే ఎంచుకున్నారు తప్ప అందరి ఆశలను ఆశలుగానే ఉంచారు. అయితే ఇటీవల కాలంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది.

ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన ఓరుగల్లు తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హైదరాబాద్ తర్వాత వరంగల్ కే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించడమే కాకుండా ఉమ్మడి జిల్లాలో ఉద్యమకారులతో పాటు తనతోపాటు ముందునుండీ కొనసాగిన వారికి, కొత్తగా చేరిన వారికి .. ఇలా ఏ ఒక్కరికీ ప్రాధాన్యత తగ్గించకుండా అందరినీ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా ఛైర్‌పర్సన్‌ల ఎంపిక విషయంలో కేసీఆర్ చాలా దూకుడుగా వెళుతున్నారనేది పార్టీ వర్గాల్లో ఉన్న టాక్. ఇప్పటికే వరంగల్ కు చాలా వరకు రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చిన కేసీఆర్ ఇక ఇతర జిల్లాలపై దృష్టి పెడతారని అందరనుకోగా.. నాలుగురోజుల క్రితం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో మళ్లీ వరంగల్ నే సెంటర్ పాయింట్ గా చేయడం అందరినీ ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది.

అయితే అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఇప్పటివరకు వరంగల్ కు వచ్చిన రాష్ట్ర స్థాయి పదవుల్లో పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పేర్వారం రాములు, రాష్ట్ర సివిల్ సప్లయిస్‌ ఛైర్మన్‌గా పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆగ్రోస్ ఛైర్మన్‌గా కిషన్ రావు, గొర్రెల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా రాజయ్య యాదవ్, హ్యాండీక్రాఫ్ట్స్ ఛైర్మన్‌గా బొల్లం సంపత్, ఖాదీ బోర్డు ఛైర్మన్‌గా మౌలానా, .. ఇవే కాకుండా డైరెక్టర్లుగా మరికొందరిని నియమించారు.

అయితే వీరందరి నియామకాల్లో కేసీఆర్ సమీకరణాలు ఎలా ఉన్నా.. ఇటీవల భర్తీ చేసిన పోస్టుల విషయంలో మాత్రం రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. సోమవారం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన వాసుదేవరెడ్డి, గుండు సుధారాణి, గాంధీనాయక్ ఉన్నారు. వీరిలో వాసుదేవరెడ్డి విద్యార్థి ఉద్యమ నేతగా కేయూ నుంచి పోరాటం సాగించారు. తెరాస విద్యార్థి విభాగం నేతగా కొనసాగుతూనే.. కేసీఆరే తనకు న్యాయం చేస్తారన్న ధీమాతో ముందుకుసాగారు.

ముందుగానే నిర్ణయించిన మేరకు వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వాసుదేవరెడ్డిని ప్రకటించిన కేసీఆర్.. మరో అడుగు ముందుకేసి తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం వచ్చే వరకు అరగుండు, మీసంతో ఉంటానని చెప్పి అలాగే ఉంటూ కేసీఆర్ కు వీర విధేయుడుగా ఉన్న మానుకోటకు చెందిన గాంధీనాయక్ కు గిరిజన సహకార సంస్థ ఛైర్మన్‌గా అవకాశమిచ్చారు. దీంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఇద్దరిని గుర్తించినట్లయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అయితే మానుకోట నియోజకవర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ విషయంలో కేసీఆర్ ఇప్పటివరకు ఎలాంటి స్టెప్స్ తీసుకోకపోవడంపై చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందే తన రాజకీయ భవిష్యత్ ను ఫణంగా పెట్టి వచ్చిన సత్యవతికి ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదని ఆమె సన్నిహితుల్లో ఆవేదన నెలకొంది. ఇదే సమయంలో మరో టాక్ కూడా వినిపిస్తోంది.

గుండు సుధారాణి వరంగల్ నగరంలో గతంలో టీడీపీ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికై ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా చంద్రబాబు అత్యున్నత అవకాశమివ్వడంతో పదవిలో కొనసాగారు. అయితే పదవి ముగియడానికి ఆరు నెలల ముందు ప్రధానంగా వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ముందు సుధారాణి తెరాసలో చేరడం, ఆ తర్వాత నగర పాలక సంస్థ ఎన్నికల్లో చాలా యాక్టివ్ గా పనిచేయడంతో కేసీఆర్ ఆమె విషయంలో కొంత సానుకూలంగా ఉన్నారు. ఆమె పార్టీలో చేరే సమయంలోనే ఎమ్మెల్సీగానీ, ఏదైనా నామినేటెడ్ ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకున్నారు కూడ. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలితో పాటు మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్‌పర్సన్‌గా సుధారాణిని కేసీఆర్ నియమించారు. అయితే సుధారాణికి రెండు పదవులు ఎందుకివ్వాలన్న చర్చ ప్రస్తుతం పార్టీలో జరుగుతోంది.

గతంలో ఈ రెండు పోస్టులు చేయాలని కేసీఆర్ కొండా సురేఖను అడిగితే ఆమె అందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పాటు తనకు మంత్రి పదవి కావాలంటూ కోరడంతో ఆ పోస్టును సురేఖ సామాజిక వర్గానికే చెందిన గుండు సుధారాణికి ఇచ్చి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒకవర్గం వారిని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు కేసీఆర్. సుధారాణికి ఈ పదవులు రావడం వెనక నిర్మల్ కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత వేణుగోపాలాచారి ప్రమేయంతో పాటు పార్టీలో మరో మంత్రి సహకారం కూడా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

టీడీపీలో ఉండగా.. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో సన్నిహితంగా ఉన్న సుధారాణి ఇప్పుడు టీఆర్ఎస్ అధినాయకత్వంతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారనే చెప్పుకోవాలి. మరోవైపు సుధారాణి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆమెకు పార్టీ మహిళా అధ్యక్షురాలు పదవితో పాటు ఫెడరేషన్ ఛైర్‌పర్సన్‌ పదవి కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన నియామకాల్లో కూడా బొల్లం సంపత్, మౌలానా వంటి వారు కూడా నేరుగా అధిష్టానంతోనే సంబంధాలు పెట్టుకుని పదవులు తెచ్చుకోవడంతో స్థానిక ఎమ్మెల్యేలకు కొంత ఇబ్బందిగానే ఉంది.

మొత్తంమ్మీద నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చూస్తుండగానే పూర్తవుతోంది సరికదా.. కొత్త వివాదాలకు మూలమవుతోంది. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలలో భాగంగానే ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మొత్తంలో పదవుల భర్తీ జరుగుతోందట. గతంలో టీఆర్‌ఎస్‌ రెబల్‌గా వ్యవహరించిన గడ్డం యుగంధర్‌ గౌడ్‌ను ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, ఎమ్మెల్యే కొండా సురేఖ తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఏ ఒక్కరి ఆధిపత్యం కొనసాగకుండా మొత్తంగా పవర్ సెంటర్ అంతా అధిష్టానమే కావాలనేది ఇందులో గులాబీదళపతి అంతరంగమని పార్టీ సీనియర్ ఒకరు చెప్పారు. ఏదేమైనా ఈ కొత్త పదవులు.. అందులోనూ జోడు పదవులు ఎలాంటి వివాదానికి తెరతీస్తాయో.. ఈ వివాదాల్లో ఎవరిది పైచేయి అవుతుందో వేచిచూడాల్సిందే!