బిగ్ బాస్ లో మరీ చిల్లర వ్యవహారాలు..

0తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ముగింపు దశకు చేరుకుంది. 89 రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రోజు రోజుకు దారుణంగా తయారు అవుతుంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు కాస్త ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఆడమగ టాస్క్ ల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని మర్చి పోయి మరీ కాస్త ఎబ్బెట్టు టాస్క్ లు ఇస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా టికెట్ టూ ఫినాలే టాస్క్ చిల్లర వ్యవహారంలా సాగింది. టాస్క్లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న కారులో ఇంటి సభ్యులు 24 గంటల వరకు కూర్చోవాల్సి ఉంటుంది. 24 గంటలు ముగిసే సమయానికి కారులో కేవలం ఒక్కరు మాత్రమే ఉండాలి. ఆ ఒక్కరు డైరెక్ట్ గా ఫినాలే వీక్ కు వెళ్తారు.

టాస్క్ ప్రారంభం కాగానే తనీష్ – దీప్తి – గీత మాధురి – సామ్రాట్ – శ్యామలలు కారు ఎక్కేశారు. రోల్ రైడా టాస్క్ ప్రారంభంకు ముందే కారును టచ్ చేసిన కారణంగా సంచాలకుడిగా ఉన్న కౌశల్ అతడిని పోటీ నుండి తప్పించాడు. ఇక అమిత్ కారు ఎక్కేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. కారులో అయిదుగురు ఎక్కడం జరిగింది. ఏదో విధంగా నలుగురిని దించేసి ఒక్కరు చివరి వరకు మిగలాల్సి ఉంటుంది. కారులో నిద్ర పోయిన కారణంగా గీత మాధురి టాస్క్ నుండి వైదొలింది. ఆ తర్వాత నలుగురు మిలిగారు. దీప్తిని తనీష్ మరియు శ్యామలను సామ్రాట్ లు కారు దించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో దీప్తితో తనీష్ వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది.

ఒక మహిళ అని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా ఆమెను కారులోంచి బయటకు నెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో చాలా మ్యాన్ హ్యాండ్ లింగ్ కూడా చేశాడు. ఇక శ్యామలపై కూడా సామ్రాట్ తన బలంను ప్రయోగించాడు. దీప్తి మరియు శ్యామల లు చాలా కష్టపడి కారులోనే ఉండి పోయారు. ఇక 24 గంటలు కారులోనే ఉండటంతో తనీష్ పక్కన ఆడవారు ఉన్నారు అనే కనీస ద్యాస కూడా లేకుండా – గేమ్ కోసమే అంటూ కారులోనే మూత్రం పోసేందుకు వెనుకాడలేదు. కాని సామ్రాట్ మాత్రం తనకు మూత్రం రావడంతో టాస్క్ నుండి వైదొలిగాడు. కారు దిగి నేరుగా బాత్ రూంకు వెళ్లి పోయాడు. ఇలా బిగ్ బాస్ ముగింపుకు వస్తున్నా కొద్ది చిల్లర వ్యవహారాలు జరుగుతుండటంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.