చిరు ఫాంహౌస్ లో అగ్నిప్రమాదం.. మంటల్లో సైరా సెట్!

0

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సైరా సెట్ లో మంటల్లో చిక్కకుంది. కోకాపేటలోని చిరంజీవి ఫాంహౌస్ లో నిర్మించిన సైరా సెట్ ఈ తెల్లవారుజామున అగ్నిమంటల్లో చిక్కుకున్నట్లుగా సమాచారం. దాదాపు నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫాంహౌస్ కోకాపేటలో చిరంజీవికి ఉన్నట్లు చెబుతారు.

సైరా సెట్ ను అందులో ఏర్పాటు చేశారు. కోటతో పాటు.. సినిమాకు సంబంధించిన కీలకమైన సెట్స్ ఇందులోనే ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదానికి కారణం తెలీదు కానీ.. మంటల్లో సెట్ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. మంటలు మొదలుకావటం.. కాసేపటికే మంటలు పెద్దవి కావటంతో.. వాటిని ఆర్పేందుకు అక్కడి సిబ్బంది ప్రయత్నించినా సాధ్యం కాలేదని చెబుతున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ.. పోలీసులు.. ఘటనా స్థలానికి వెళుతున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటల్లో సైరా సెట్ మొత్తం తగలపడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.

ఈ మూవీ ప్రారంభమైన నాటి నుంచి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. కొద్ది రోజలు క్రితం అన్నపూర్ణ స్టూడియో లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో సైరా సెట్ తగలబడింది. దీంతో.. షూటింగ్ ఆగింది. తర్వాత శేరిలింగంపల్లిలో వేసిన సెట్ ను ప్రభుత్వ అధికారులు కూల్చేవేశారు. అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో సెట్ వేశారని దాన్ని తొలగించారు. అనంతరం.. తన సొంత ఫాంహౌజ్ కు షూటింగ్ మార్చుకున్నారు మెగాస్టార్. తాజాగా అక్కడ కూడా అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం గమనార్హం.
Please Read Disclaimer